Rahul Gandhi: దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారు- బీజేపీ ఎంపీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీని ద్రోహి అని నిప్పులు చెరిగారు.

Update: 2024-12-05 10:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీని ద్రోహి అని నిప్పులు చెరిగారు. అమెరికా బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ అజెండాను రాహుల్‌ (Rahul Gandhi) ముందుకుతీసుకెళ్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘రాహుల్‌ గాంధీ, జార్జ్‌ సోరోస్‌ (George Soros), ఆయన మద్దతున్న ఓసీసీఆర్పీ మధ్య సంబంధాలు ఉన్నాయి. ఒకరికి ఇబ్బంది వస్తే మరొకరు భయపడతారు. రాహుల్, సోరోస్ ఇద్దరూ ఒకటే. తమ అజెండాను నెరవేర్చుకోవాలని సోరోస్ కోరుకుంటున్నారు. ఆయనకు రాహుల్‌ సాయపడుతున్నారు. దేశ ప్రయోజనాలకు ముప్పుతేవడమే వారిద్దరికీ కావాలి. దేశాన్ని విభజించాలని చూసేవారు ప్రగతిని చూడలేరు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఒక ద్రోహి. ఇలా అనేందుకు నేనే మాత్రం భయపడను’’ అని సాంబిత్‌ పాత్రా పైర్ అయ్యారు.

అదానీపై కేసు

ఇకపోతే, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani)పై అమెరికాలో కేసు నమోదైంది. దీంతో, ఆయనను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలానే అదానీని మోడీ ప్రభుత్వం కాపాడుతోందని అన్నారు. ఈ వ్యవహారం (Adani Row)పై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. దీంతో, మోడీ, అదానీ ఇద్దరూ ఒకటే అంటూ రాహుల్ చేస్తున్న విమర్శలపై బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. ఇకపోతే, ప్రముఖ బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌, రాక్‌ఫెల్లర్స్ బ్రదర్స్‌ వంటి దిగ్గజాలతో నడుస్తున్న ఆర్గనైజ్డ్‌ క్రైమ్ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (OCCRP) స్టోరీలు వెలువరిస్తుంటుంది. ఇటీవలే గౌతమ్ గ్రూప్ పై ఒక స్టోరీని కూడా వెలువరించింది. దీనిపైనే బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Tags:    

Similar News