రాజ్యసభకు స్మృతి ఇరానీ, అర్జున్ ముండా, ఆర్‌‌కే సింగ్‌ ?

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 10 మంది రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి విజయం సాధించారు.

Update: 2024-06-13 16:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 10 మంది రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసోం,బిహార్, మహారాష్ట్రలలో రెండు చొప్పున.. హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలలో ఒక్కో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. త్వరలోనే ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్‌ తేదీలను ప్రకటించనుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ముగ్గురు మాజీ కేంద్రమంత్రులను ఈ రాజ్యసభ స్థానాలకు నామినేట్ చేయాలని కమలదళం యోచిస్తోంది. స్మృతి ఇరానీ, అర్జున్ ముండా, ఆర్‌‌కే సింగ్‌లను రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ చేతిలో స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. జార్ఖండ్‌లోని ఖుంతీ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి కాళీ చరణ్ ముండా చేతిలో అర్జున్ ముండా ఓడిపోయారు. బిహార్‌లోని అర్రాలో సీపీఐ(ఎంఎల్)ఎల్ అభ్యర్థి సుదామ ప్రసాద్‌ చేతిలో ఆర్కే సింగ్ ఓటమి పాలయ్యారు. ఈ ముగ్గురు కూడా గతంలో కేంద్రమంత్రులుగా మంచి పనితీరు కనబర్చారని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వారు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజ్యసభ మార్గం ద్వారా పార్లమెంటులోకి ఎంట్రీ కల్పించాలని యోచిస్తున్నారని అంటున్నారు. కేంద్ర మంత్రులుగా ఈ ముగ్గురి అనుభవాన్ని వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.


Similar News