India Map : సీడబ్ల్యూసీ సమావేశాల్లో భారత మ్యాప్‌పై దుమారం.. బీజేపీ ప్రశ్న.. కాంగ్రెస్ జవాబు
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఏర్పాటుచేసిన బ్యానర్‌పై భారతదేశపు తప్పుడు మ్యాప్(India map)ను ప్రదర్శించారంటూ బీజేపీ(BJP) అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఫైర్ అయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఏర్పాటుచేసిన బ్యానర్‌పై భారతదేశపు తప్పుడు మ్యాప్(India map)ను ప్రదర్శించారంటూ బీజేపీ(BJP) అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఆ మ్యాప్ ఒక నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అమెరికా బిలియనీర్ జార్జ్ సోరస్‌కు చెందిన సీక్రెట్ సర్వీస్ నుంచే ఆ మ్యాప్ కాంగ్రెస్ పార్టీ(Congress)కి అంది ఉండొచ్చన్నారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు లేకుండా భారత మ్యాప్‌ను ప్రదర్శించడాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏమిటో.. ఎటువంటి శక్తులతో ఆ పార్టీ చేతులు కలిపిందో అందరికీ తెలిసిపోయింది’’ అని సుధాంశు త్రివేది విమర్శించారు.
భారత్‌ను నాశనం చేయాలని కుట్ర పన్నుతున్న శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించారు. కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే కూడా గతేడాది అక్టోబరులో ఇలాంటి తప్పుడు మ్యాప్‌నే ప్రదర్శించిందన్నారు. 2020లో రాహుల్ గాంధీ, 2022లో శశి థరూర్‌లు కూడా ఇదే విధమైన మ్యాప్‌ను షేర్ చేశారని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇలాంటివన్నీ అనుకోకుండా జరుగుతున్నాయా ? ముందస్తు ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయా ? సోరస్ సీక్రెట్ సర్వీసు నుంచి ఆ మ్యాప్స్ అందుతున్నాయా ? అనేది కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి’’ అని సుధాంశు త్రివేది ప్రశ్నించారు. ‘‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా గతంలో నిరసనలు తెలిపినవారు సిలిగురి కారిడార్ లేకుండా భారత మ్యాప్‌ను ప్రదర్శించినా కాంగ్రెస్ అభ్యంతరం చెప్పలేదు.. ఇంతకీ సిలిగురి కారిడార్‌కు, సీఏఏకు సంబంధమేంటో కాంగ్రెస్ చెప్పాలి’’ అని ఆయన అడిగారు. ‘‘కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోంది. ప్రాంతం, కులం, మతం ఆధారంగా దేశాన్ని విభజించాలని కుట్ర పన్నుతోంది’’ అని సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు.
భారత మ్యాప్‌పై కాంగ్రెస్ స్పందన..
సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా హస్తం పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్‌లపై రాజకీయ దుమారం చెలరేగింది. అందులో భారత చిత్రపటాన్ని తప్పుగా చూపడంపై బీజేపీ విమర్శనాస్త్రాలను సంధించింది. దీంతో బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఆ బ్యానర్లను తమ పార్టీ అధికారికంగా పెట్టలేదని, ఎవరో పార్టీ కార్యకర్తలు పెట్టి ఉండొచ్చని స్పష్టం చేసింది.