బీజేపీ పదో జాబితా రిలీజ్: మాజీ ప్రధాని కుమారుడికి అవకాశం
లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ పదో జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ పదో జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఒకరు, చండీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఒక అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా స్థానం నుంచి మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్‌ను బరిలోకి దింపింది. అలాగే ఘాజీ పూర్ సెగ్మెంట్ నుంచి పరాస్ నాథ్ రాయ్, కొశాంబిలో వినోద్ సోంకర్, మైన్‌పురి నుంచి జైవీర్ సింగ్ ఠాకూర్, అలహాబాద్ స్థానంలో నీరజ్ త్రిపాఠి, మచ్చిలిషహర్ నుంచి బీపీ సరోజ్, ఫుల్‌పూర్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ కేశరీ దేవి పటేల్ స్థానంలో ప్రవీణ్ పటేల్‌ను పోటీలో నిలిపింది.
ఇక, ఇక, పశ్చిమ బెంగాల్‌లోని అసన్ సోల్ నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియాకు టికెట్ ఇచ్చారు. అహ్లువాలియా ప్రస్తుతం బర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే చండీగఢ్ నుంచి సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్‌ను పక్కన పెట్టి సంజయ్ టాండన్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. తాజా జాబితాతో కలిసి బీజేపీ ఇప్పటివరకు 413 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.