Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ని చంపితే రూ. కోటి బహుమతి.. ఖైదీలకు కర్ణి సేన ఆఫర్
లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు రూ. కోటి ఇస్తామని ఇటీవల ప్రకటించిన కర్ణి సేన.. తాజాగా మరో ఆఫర్ ఇచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో: గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ని ఎన్‌కౌంటర్ (Encounter) చేసిన పోలీసులకు రూ. కోటి ఇస్తామని ఇటీవల ప్రకటించిన కర్ణి సేన(Karni sena).. తాజాగా మరో ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలు (Sabarmati Central Jail)లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ను హతమార్చిన ఖైదీలకు సైతం రూ. 1,11,11,111 ఇస్తామని ప్రకటించింది. క్షత్రియ కర్ణి సేన చీఫ్ రాజ్ షెకావత్(Raj Shekhawat) ఈ నగదు బహుమతిని ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో మంగళవారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘జైలు ఆవరణలో బిష్ణోయ్‌ని చంపిన పోలీసులకు రూ.కోటి ఇస్తామని ఇటీవల ప్రకటించాం. అదే విధంగా జైలులో ఉన్న ఖైదీలు ఎవరైనా లారెన్స్‌ని చంపినట్లయితే వారికి కూడా క్షత్రియ కర్ణి సేన అదే బహుమతిని అందజేస్తుంది’ అని తెలిపారు.
లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ (Drugs smuggling) కేసులో భాగంగా సబర్మతి జైలులో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(salman khan) నివాసం వెలుపల కాల్పులు జరిపిన కేసులోనూ అతని పేరు ఉంది. అయితే ఇప్పటి వరకు ముంబై పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోలేదు. అంతేగాక గతేడాది డిసెంబర్ 5న జైపూర్‌లో కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అనంతరం ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. దీంతో అప్పటి నుంచి కర్ణిసేన బిష్ణోయ్‌పై ఆగ్రహంతో ఉంది.
కాగా, బిష్ణోయ్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా తమ కార్యకాపాల కోసం పని చేస్తూనే ఉంది. ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్య, సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాబా సిద్ధిఖీని డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకులు, సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. సిద్ధిఖీ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతను మరింత పెంచడం గమనార్హం.