కాంగ్రెస్‌కు బిగ్ షాక్: పార్టీకి కీలక నేత రాజీనామా
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మిలింద్ డియోరా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్రకు చెందిన పార్టీ సీనియర్ నేత మిలింద్ డియోరా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘నా రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల బంధానికి ముగింపు పలికాను’ అని పేర్కొన్నారు. తనకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మిలింద్ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ డియోరా కుమారుడైన మిలింద్ 2004, 2009లో ముంబై సౌత్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని వర్గం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2014కి ముందు డియోరా ప్రాతినిధ్యం వహించిన ముంబై సౌత్ నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతను అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.