సుప్రీంకోర్టులో జర్నలిస్టులకు భారీ ఊరట.. ప్రభుత్వాలకు షాక్
ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పు పట్టింది. అది భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే చర్య అవుతుందని వ్యాఖ్యానించింది.
దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో జర్నలిస్టులకు భారీ ఊరట లభించింది. ప్రభుత్వాలను విమర్శిస్తూ వార్తలు రాసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్.. తనపై ప్రభుత్వం పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదంటూ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎన్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.
ప్రజాస్వామ్య పాలన ఉన్న దేశాలలో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌరవిస్తారన్న ధర్మాసనం.. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని పేర్కొంది. వాళ్లు రాసే ప్రభుత్వ వ్యతిరేక కథనాలను విమర్శలుగా భావించి క్రిమినల్ కేసులు పెట్టరాదని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. అలా చేస్తే భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. జర్నలిస్ట్ అభిషేక్ ను అరెస్ట్ చేయవద్దని పేర్కొంటూ సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది.
యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ రాసిన కథనాన్ని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో అభిషేక్ కు ఆన్లైన్ లో వేధింపులు మొదలయ్యాయి. తనకు రక్షణ కల్పించాలని యూపీ డీజీపీకి అభిషేక్ మెయిల్ రాసి.. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అందుకు యూపీ పోలీస్ విభాగం రిప్లై ఇచ్చింది. పుకార్లు, తప్పుడు సమాచారాన్ని రాస్తే.. సమాజంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని, అలా జరిగితే తనపైనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో అభిషేక్ సుప్రీంను ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించింది.