Bhupender Yadav: వయనాడ్ విషాదానికి కేరళ ప్రభుత్వమే కారణం.. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

వయనాడ్ విషాద ఘటనకు కేరళ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఆరోపించారు. అక్రమ మైనింగ్, అనుమతి లేకుండా మానవ నివాసాలు ఏర్పాటు కారణంగానే కొండచరియలు విరిగిపడ్డాయని ఫైర్ అయ్యారు.

Update: 2024-08-05 08:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ విషాద ఘటనకు కేరళ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఆరోపించారు. అక్రమ మైనింగ్, అనుమతి లేకుండా మానవ నివాసాలు ఏర్పాటు కారణంగానే కొండచరియలు విరిగిపడ్డాయని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం ఆయన ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. ఇది అత్యంత సున్నితమైన ప్రాంతం అయినప్పటికీ టూరిజం పేరుతో సరైన జోన్లు కూడా చేయడం లేదని.. ఈ ప్రాంతాన్ని ఆక్రమణకు అనుమతించారని మండిపడ్డారు. ఈ అంశంపై మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ అండతోనే ఇల్లీగల్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. విషాదానికి కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.

387కి చేరిన మృతుల సంఖ్య

కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 387కి చేరుకుంది. ఏడో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముండక్కై, చురలమల, సమాలిమట్టంలో ఆరు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు 6759 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. అలాగే 220 మంది మృత దేహాలను గుర్తించారు.కేరళ మంత్రి ఎకె శశీంద్రన్ మాట్లాడుతూ..కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని 6 జోన్లుగా విభజించామని.. ఒక్కో జోన్‌లో 40 మందితో కూడిన బృందం సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తోందని తెలిపారు.

పాఠశాలలు పున:ప్రారంభం

కొండచరియలు విరిగిపడటంతో నిరంతర సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. అయితే, సహాయక శిబిరాలు నడుస్తున్న పాఠశాలలకు మాత్రం సెలవులు ఇచ్చారు. మరోవైపు బాధిత ప్రాంతాల్లో రాత్రిపూట పోలీసుల పెట్రోలింగ్‌కు ఆదేశించినట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. రాత్రి వేళల్లో బాధితుల ఇళ్లు లేదా ప్రాంతాల్లోకి చొరబడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

Tags:    

Similar News