Bharat Bandh: రేపు భారత్ బంద్.. కారణమిదే?

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.

Update: 2024-08-20 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఈ బంద్‌కు మద్దతు తెలిపింది. బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా వ్యాపార సముదాయాలతో పాటు, ప్రజా రవాణా, ప్రయివేటు కార్యాలయాల కార్యకలాపాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, పెట్రోల్ పంపులు పనిచేస్తాయని పలువురు పేర్కొన్నారు.

ముఖ్యంగా రాజస్థాన్‌లోని పలు సంఘాలు బంద్‌కు బలమైన మద్దతునిచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు శాంతి భద్రతల దృష్యా ప్రధాన నగరాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీ-ఎన్సీఆర్, హర్యానాలో నిరసనలను నిరోధించడానికి పోలీసులు రోడ్లపై బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, ఎస్సీ, ఎస్టీలో ఉప కేటగిరీలను సృష్టించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పలువురు స్వాగతించగా, మరి కొందరు వ్యతిరేకించడంతో దీనిపై వివాదం నెలకొంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాజాగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి బంద్ కు పిలుపునిచ్చింది. 

Tags:    

Similar News