Bengal : గవర్నర్‌పై కేసును దర్యాప్తు చేస్తున్న ఐపీఎస్‌కు మెడల్.. దీదీ సర్కారు వివాదాస్పద నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా నలుగురు ఐపీఎస్ అధికారులను పోలీస్ మెడల్స్‌కు మమతా బెనర్జీ సర్కారు ఎంపిక చేసింది. వారిలో కోల్‌కతా పోలీస్ డీసీపీ ఇందిరా ముఖర్జీ కూడా ఉన్నారు. ప్రత్యేకంగా ఈమె పేరు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసును ప్రస్తుతం ఇందిరా ముఖర్జీయే విచారిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీమ్‌కు ఆమె సారథ్యం వహిస్తున్నారు. తనపై తప్పుడు అభియోగాలను నమోదు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు టీమ్‌ను మమతా బెనర్జీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని గవర్నర్ ఆనంద బోస్ ఆరోపిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేయలేరని ఆయన వాదిస్తున్నారు. ఈనేపథ్యంలో దీదీ సర్కారు ప్రత్యేక ఆసక్తితో ఇందిరా ముఖర్జీకి పోలీస్ మెడల్‌ను ప్రకటించడం గమనార్హం.