Syria: రెబల్స్ చేతికి సిరియా.. రష్యాకు అధ్యక్షుడు పలాయనం!

మరో అరబ్ దేశంలో ప్రభుత్వం కుప్పకూలింది. రెండు దశాబ్దాల క్రితం మొదలైన తిరుగుబాటు.. నేడు దేశాన్ని కైవసం చేసుకునే స్థితికి చేరింది. ఐదు దశాబ్దాల (Bashar Al Assad) అసద్ కుటుంబ పాలనకు చరమగీతం పాడింది. ముఖ్యంగా 24 ఏళ్ల బషర్ అల్ అసద్ నియంత పాలన(Iron Fist)కు ముగింపు పలికింది.

Update: 2024-12-08 19:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మరో అరబ్ దేశంలో ప్రభుత్వం కుప్పకూలింది. రెండు దశాబ్దాల క్రితం మొదలైన తిరుగుబాటు.. నేడు దేశాన్ని కైవసం చేసుకునే స్థితికి చేరింది. ఐదు దశాబ్దాల (Bashar Al Assad) అసద్ కుటుంబ పాలనకు చరమగీతం పాడింది. ముఖ్యంగా 24 ఏళ్ల బషర్ అల్ అసద్ నియంత పాలన(Iron Fist)కు ముగింపు పలికింది. మూడో అతిపెద్ద నగరమైన అలెప్పో(Aleppo)ను కైవసం చేసుకున్న తర్వాత అత్యంత వేగంతో రాజధాని డమస్కస్‌(Damascus)ను గుప్పిట్లోకి తీసుకుంది. డమస్కస్ వైపు ఈ రెబల్స్(HTS Rebels) వస్తున్న నేపథ్యంలో ఆదివారం ఉదయమే సిరియా దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ పారిపోయాడు. ఉదయమే ఫ్లైట్ ఎక్కి గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయాడు. రెబల్స్ గ్రూప్స్ డమస్కస్ చేరుకోవడంతో తిరుగుబాటుదారులతోపాటు కొందరు స్థానికులు కూడా కేరింతలతో ఆ సందర్భాన్ని వేడుక చేసుకున్నారు. అసద్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. అధికార మార్పిడీకి ఆదేశాలు జారీ చేసి దేశం వదిలాడని రష్యా పేర్కొంది. ఇదే కోణంలో ప్రధాని జలాలీ కూడా స్పందించారు. తిరుగుబాటుదారులకు అధికారాన్ని శాంతియుతంగా బదలాయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రభుత్వ భవనాలను ఎవరూ కూల్చవద్దని, అవి ప్రజలందరి అస్తులని సూచించారు. డమస్కస్ చేరుకున్న తర్వాత తిరుగుబాటుదారులు విజయాన్ని ప్రకటించారు. హయత్ తహ్రిర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) దేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామాలు ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చాయి. అసద్ మిత్రులు, శత్రువులు సైతం ఖంగుతిన్నారు.

అలెప్పోతో మునుముందుకు

దాదాపు రెండు దశాబ్దాలుగా సిరియాలో అంతర్యుద్ధం జరుగుతున్నది. బషర్ అల్ అసద్ ప్రభుత్వం నిరసనకారులను, రాజకీయ ప్రత్యర్థులను జైలులో కుక్కేసింది. కానీ, కొన్ని తిరుగుబాటు దళాలు తమ పోరుబాట వదలలేదు. చిన్నచిన్న ప్రాంతాలనైనా కైవసం చేసుకుంటూ ఉనికిని కాపాడుకున్నాయి. గతవారంలో దేశంలో మూడో అతిపెద్ద నగరం అలెప్పోను ఈ హెచ్‌టీఎస్ దళాలు ఆక్రమించుకున్న తర్వాత ఇక వెనుకడుగు వేసే పరిస్థితి ఎదురవలేదు. ఇరాన్, రష్యాలు ఇతర ఘర్షణల్లో(యుద్ధాల్లో) మునిగిపోవడంతో అసద్‌కు సహాయం సన్నగిల్లింది. ఫలితంగా రెబల్స్ వేగంగా ఒకదాని వెనక మరో నగరాన్ని గుప్పిట్లోకి తీసుకున్నారు. హెచ్‌టీఎస్, ఫ్రీ సిరియన్ ఆర్మీ సంయుక్తంగా గతవారం అలెప్పోను చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాత డమస్కస్ వైపు బయల్దేరాయి. 24 గంటల్లో నాలుగు నగరాలు దరా, ఖునెత్రా, సువేదా, హోమ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం ఉదయమ సేడ్నాయా జైలును బద్ధలు కొట్టాయి. అసద్ ప్రభుత్వం బంధించిన రాజకీయ ఖైదీలను చెర నుంచి విడిచిపెట్టాయి. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే డమస్కస్‌ను తమ చేతిలోకి తీసుకున్నాయి. ఇంతకుముందే తన 24 ఏళ్ల పాలనకు ఫుల్ స్టాప్ పెడుతూ అసద్ పారిపోయారు. ఈ మార్పులను తిరుగుబాటుదారులతోపాటు స్థానిక ప్రజలూ స్వాగతించారు. అసద్ ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగినవారూ వారి కుటుంబీకుల విగ్రహాలను ధ్వంసం చేశారు.

అధికారం తిరుగుబాటుదారులదే

క్యాపిటల్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత హయత్ తహ్రిర్ అల్ షామ్ సిరియన్ రెబల్ గ్రూప్ కమాండర్ గొలాని అధికార టెలివిజన్‌లో ఆదివారం మాట్లాడుతూ.. ఇక భవిష్యత్ మనదే. వెనకడుగు వేసే ఛాన్సే లేదు. 2011లో మొదలుపెట్టిన మార్గాన్ని ఇకపైనా కొనసాగిస్తాం’ అని స్పష్టం చేశారు. అసద్ నియంతృత్వ ప్రభుత్వం కూలిపోయిందని, డమస్కస్‌కూ విముక్తి కల్పించామని హెచ్‌టీఎస్ ప్రకటించింది. అనంతరం, ప్రధాని మొహమ్మద్ జలాలి మాట్లాడుతూ.. ప్రతిపక్షానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, పరిపాలనా బాధ్యతలను వారికి అప్పగిస్తామని వివరించారు. ఎవరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని, అవి ప్రజల ఆస్తులని విజ్ఞప్తి చేశారు. సిరియా, డమస్కస్‌లకు స్వేచ్ఛ లభించిందని, ప్రభుత్వ భవనాలను ఎవరూ ధ్వంసం చేయరాదని హెచ్‌టీఎస్ పేర్కొంది. ఈ భవనాలు ప్రస్తుతం పీఎం జలాలి అధీనంలో ఉన్నాయి. వాటిని అధికారికంగా రెబల్స్ గ్రూప్‌కు హ్యాండోవర్ చేయాల్సి ఉన్నది. యూఎన్ స్పెషల్ ఎన్వాయ్ కూడా అధికారమార్పిడీకి జెనీవాలో అత్యవసర సమావేశం నిర్వహించాల్సి ఉన్నదని శనివారం పేర్కొనడం గమనార్హం.

‘అరబ్ స్ప్రింగ్‌’ నుంచీ..

2011లో ట్యునీషియాలో ప్రారంభమై అరబ్ దేశాలన్నింటిలో అరబ్ స్ప్రింగ్ ఆందోళనలు దావనలంలా వ్యాపించాయి. అనేక దేశాల్లో ప్రభుత్వాలను ప్రజా ఉద్యమాలు కూల్చేశాయి. అధ్యక్షులు మారిపోయారు. సిరియా దేశంలోనూ అప్పుడు అదే పరిస్థితి వచ్చింది. కానీ, రష్యా, ఇరాన్ సహకారంతో అధికారంలోని బషర్ అల్ అసద్ నిరసనకారులపై ఉక్కుపాదం మోపారు. అప్పటి నుంచి అంతర్యుద్ధం కొనసాగినా.. కొన్ని సంవత్సరాల క్రితం దాదాపుగా చల్లబడింది. కానీ, ఇటీవల ఈ తిరుగుబాటు వేగమందుకుంది. ముఖ్యంగా ఇరాన్, రష్యాలు వేర్వేరు యుద్ధాల్లో మునిగిపోవడంతో సిరియాకు అందాల్సినమేర సహాయం అందలేదు. ఈ తరుణంలో తిరుగుబాటుదారులు విజృంభించడంతో అసద్ ప్రభుత్వం వారిని అదుపు చేయలేకపోయింది. ఫలితంగా సుమారు ఐదు దశాబ్దాల అసద్ కుటుంబ పాలన ముగిసింది. 24 ఏళ్లకు ముందు బషర్ అల్ అసద్ తండ్రి హఫెజ్ అల్ అసద్ కూడా నియంతృత్వ పాలన సాగించారు.

యూఎస్‌కు సంబంధమే లేదు.

సిరియా అంటేనే అరాచకమని, అది తమ మిత్రదేశమూ కాదని అమెరికా కాబోయే అధ్యక్షుడు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. యూఎస్‌కు ఈ మార్పులతో సంబంధమే లేదని వివరించారు. ఇది తమ యుద్ధం కాదని, అక్కడ ఏం జరుగుతుందో జరగనీమని పేర్కొన్నారు. ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఇక అసద్ దేశం విడిచినట్టు రష్యా పేర్కొంది. అధికార మార్పిడీకి అంతకుముందే ఆదేశాలిచ్చినట్టు వివరించింది. అయితే, అసద్ ఎక్కడున్నాడనే వివరాలను తెలుపలేదు. అసద్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేశారని ఓ వార్త వైరల్ అయింది. కానీ, ఆ వార్తను ఎవరూ ధ్రువీకరించలేదు.

సిరియాలో సుమారు 900 అమెరికా ట్రూపులు ఉన్నాయి. ఈశాన్య సిరియాలో మళ్లీ ఐఎస్ తీవ్రవాదం వేళ్లూనకుండా కుర్దిష్ గ్రూపులతో కలిసి ఈ ట్రూపులు పని చేస్తున్నాయి. కాగా, యూఎస్, కుర్దీష్ దళాల నియంత్రణలోని కొన్ని భూభాగాలను టర్కీ మద్దతున్న సిరియన్ర దళాలు స్వాదీనం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చిన రెబల్స్‌కు ఉగ్రవాదులతోనూ సంబంధాలున్నాయని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నట్టు సిరియా అపోజిషన్ యాక్టివిస్టులు పేర్కొన్నారు. ఇదే సిరియాలో రష్యా దళాలూ ఉన్నాయి. అయితే, అసద్ ప్రభుత్వం కూలిపోయి తిరుగుబాటుదారులు అధికారంలోకి వచ్చినా వెంటనే తమకు వచ్చే ముప్పేమీ లేదన్నట్టుగా రష్యా పేర్కొంది.


రష్యాలో అసద్‌కు ఆశ్రయం

బషర్ అల్ అసద్, ఆయన కుటుంబం రష్యాకు వచ్చినట్టు, రష్యా అధికారులు ఆయనకు ఆశ్రయం కల్పించినట్టు వార్తలు వచ్చాయి. క్రెమ్లిన్ అధికారవర్గాలను పేర్కొంటూ రష్యా న్యూస్ ఏజెన్సీ ది ఇంటర్‌ఫ్యాక్స్ ఈ మేరకు ఓ వార్తను ప్రచురించింది. ప్రెసిడెంట్ అసద్ సిరియా నుంచి మాస్కోకు వచ్చారు. ఆయనకు, ఆయన కుటుంబానికి రష్యా మానవీయ కోణంలో ఆలోచించి ఆశ్రయం కల్పించింది’ అని పేర్కొంది.

Tags:    

Similar News