సిరియా రెబల్స్ చేతికి ‘డమాస్కస్‌’.. దేశ రాజధానిని వీడిన అధ్యక్షుడు బషర్-అల్-అసద్‌

సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది.

Update: 2024-12-08 04:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. తిరుగుబాటుదారులు వరుసగా దేశంలోని కీలక నగరాలను తమ సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆదివారం దేశ రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైన్యం మరియు భద్రతా బలగాలు డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విడిచిపెట్టినట్లు సమాచారం. దేశ రాజధానిలోకి తిరుగుబాటుదారులు చొరబడటంతో అసద్ సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు హెజ్బుల్లా ఓ మీడియా సంస్థకు తెలిపింది. ఇస్లామిస్ట్ హయత్-అల్-షమ్ గ్రూప్ డమాస్కస్‌కు తమ సాయుధ దళాలు చేరుకున్నట్లు ధృవీకరించాయి. ‘సెద్నాయ జైలులో దౌర్జన్య యుగం ముగిసిందని’ ఈ సందర్భంగా తిరుగుబాటుదారులు ప్రకటించారు. రాజధాని వెళ్లే మార్గంలో వ్యూహాత్మక నగరమైన హోమ్స్‌ను తిరుగుబాటుదారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. కానీ సిరియా రక్షణ శాఖ మాత్రం ఈ విషయాన్ని ఖండించింది. హోమ్స్‌లో పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు ప్రకటించింది.

రాజధానిని వీడిన దేశ అధ్యక్షుడు అసద్

దేశ రాజధానిలోకి తిరుగుబాటు దారులు చొరబడటంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్-అల్-అసద్‌ డమాస్కస్‌‌ను విడిచి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. అధ్యక్షుడు విమానంలో గుర్తు తెలియని చోటుకి వెళ్లిపోయినట్లు ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. రెబల్స్ డమాస్కస్‌లోకి చొచ్చుకురావడంతో స్థానికంగా నివసిస్తున్న పౌరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. వీధుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు వెల్లడించారు. ప్రజలు భారీగా ఏటీఎంల వద్దకు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. డమస్కస్‌లో ఏర్పాటు చేసిన అసద్ తండ్రి, దివంగత నాయకుడు హఫీజ్-అల్-అసద్ విగ్రహాన్ని తిరుగుబాటుదారులు కూల్చివేశారు.

సిరియా నుంచి పారిపోయిన సుమారు 2వేల మంది సైనికులను బాగ్దాద్‌లోకి అనుమతించినట్లు ఇరాక్ భద్రతా దళాలు ప్రకటించాయి. అల్ ఖైదా అనుబంధ సంస్థగా హయత్-తహ్రీర్-అల్-షమ్ సిరియాలో పాతుకుపోయింది. మెనార్టీలు దిగులు చెందాల్సిన పని లేదని వారికి భరోసా కల్పిస్తూ వచ్చింది. హింసకాండ కారణంగా 3లక్షల70వేల మంది నిరాశ్రయులు అయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్ టెర్రరిస్టులు సిరియాను భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. మాస్కో, టెహ్రాన్ యుద్ధంలో అసద్ ప్రభుత్వానికి బాసటగా ఉంటాయని ప్రకటించారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం సిరియా అంత్యర్యుద్ధంలో జోక్యం చేసుకోబోమని అనౌన్స్ చేశారు.

Tags:    

Similar News