Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ పురోహితుడి అరెస్టు.. ఇస్కాన్ ఆరోపణ

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారిని అరెస్ట్ చేసినట్టు ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారామన్ దాస్ఆరోపించారు.

Update: 2024-11-30 13:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారిని అరెస్ట్ చేసినట్టు ఇస్కాన్(Iskon) కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి రాధారామన్ దాస్ (Radharaman Das) ఆరోపించారు. అంతేగాక మైనారిటీలపై దాడుల్లో భాగంగా భైరబ్‌లోని ఇస్కాన్ సెంటర్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ మేరకు ఇస్కాన్ కేంద్రంపై పలువురు దాడి చేస్తున్న వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్‌ (Krishnadas)ను దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేసిన అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శ్యామ్ దాస్ (Shyam das) అనే యువ పూజారి జైలులో చిన్మోయ్‌ను కలిసేందుకు వెళ్లిన సమయంలో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఎటువంటి వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితేశ్యామ్ దాస్ అరెస్టుపై బంగ్లాదేశ్ అధికారికంగా స్పందించలేదు.

కాగా, బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన అల్లర్ల తర్వాత షేక్ హసీనా (Sheik haseena) నేతృత్వంలోని అవామీ లీగ్ (Avamee league) ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హిందువులు సహా ఇతర మైనారిటీలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. సుమారు 200కు పైగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బంగ్లాదేశ్ అధికారులు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును భారత్‌తో సహా పలు మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. అంతేగాక దేశ వ్యాప్తంగా అక్కడి హిందూ సంఘాలు నిరసన తెలిపాయి.

Tags:    

Similar News