ఐదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల మొండి బకాయిలు మాఫీ!
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయని ఆర్థిక మంత్రి...Bad loans worth Rs 10 lakh crore written off by banks in last five financial years, says Nirmala Sitharaman
న్యూఢిల్లీ: గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి, నాలుగేళ్లు దాటిన నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)ను రైటాఫ్ ద్వారా బ్యాలెన్స్ షీట్‌ల నుంచి తొలగించబడ్డాయని పేర్కొన్నారు. రైటాఫ్ అనేది సాంకేతికపరమైన రద్దు కింద పరిగణించబడతాయని, ఈ రుణాలు పూర్తిగా మాఫీ చేసినట్టు కాదని ఆర్థిక మంత్రి చెప్పారు. బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌లను క్లియర్ చేసే క్రమంలో మొండి బకాయిలను రైటాఫ్ చేయడం సాధారణ ప్రక్రియ.. ఆర్‌బీఐ మార్గదర్శకాలు, పాలసీలకు అనుగుణంగా సంబంధిత బ్యాంకు బోర్డు ఆమోదం ద్వారా ఇది జరుగుతుంది.. కమర్షియల్ బ్యాంకుల సమాచారం ప్రకారం, గత ఐదేళ్ల కాలంలో మొత్తం రూ. 10.10 లక్షల కోట్ల మొండి బకాయిలు రైటాఫ్ చేయబడ్డాయని వివరించారు. రైటాఫ్ చేసినప్పటికీ రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా, ఐదేళ్ల కాలంలో రైటాఫ్ చేసిన రుణాల్లో రూ. 1.32 లక్షల కోట్లతో కలుపుకుని మొత్తం రూ. 6.59 లక్షల కోట్లను బ్యాంకులు రికవరీ చేశాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.