Nagpur violence: నాగ్ పూర్ హింసపై ఆర్ఎస్ఎస్ ఏమందంటే?
నాగ్‌పూర్‌లో చెలరేగిన అల్లర్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ స్పందించింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ మాట్లాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: నాగ్‌పూర్‌లో చెలరేగిన అల్లర్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ స్పందించింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ మాట్లాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కు సమాధి ప్రస్తుత అంశం కాదని.. ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. " ఔరంగజేబు ప్రస్తుత కాలానికి సంబంధించిన వాడైతే సమాధిని తొలగించాలా? అనేది ప్రశ్న. సమాధానం ఏమిటంటే అతను సంబంధితుడు కాదు. ఏ రకమైన హింస అయినా సమాజ ఆరోగ్యానికి మంచిది కాదు" అని అంబేకర్ అన్నారు. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర, ఔరంగజేబ్ అతన్ని ఎలా ఉరితీశాడో చూపించే 'చావా' సినిమా విడుదలైన తర్వాత ఈ వివాదం మొదలైంది. ఇదిలాఉంటే.. మార్చి 17న చెలరేగిన హింసలో పలువురు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలో 34 మంది పోలీసులు గాయపడ్డారని, ఇందులో ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు కూడా ఉన్నారని ఫడ్నవీస్ తెలిపారు.
నాగ్ పూర్ లో అల్లర్లు
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కార్యకర్తలు నాగ్ పూర్ లోని మహల్ ఏరియాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీగా వెళుతున్న వీహెచ్ పీ కార్యకర్తలపై ఓ వర్గానికి చెందిన యువకులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. కాగా.. ఈ కేసులో కీలక నిందితుడు ఫహీమ్ ఖాన్ ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.