చివరి నిమిషంలో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

ఈడీ వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-06-21 13:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు నిలిపేసింది. కేజ్రీవాల్ బెయిల్‌కు వ్యతిరేకంగా ఈడీ వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుతానికి తీహార్ జైల్లోనే ఉండనున్నారు. 'జూన్ 25న ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నందున, ఆర్డర్‌ను రెండు, మూడు రోజులకు రిజర్వ్ చేస్తున్నాము. ఉత్తర్వులు వెలువడే వరకు ట్రయల్ కోర్ట్ ఆర్డర్‌పై స్టే ఉంటుందని' ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అంతకుముందు గురువారం సాయంత్రం మద్యం పాలసీ కేసులో అరవింద్ కేర్జీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తుపై ఆయన విడుదలకు కోర్టు ఆదేశించింది. అయితే, శుక్రవారం ఆయన విడుదల అవుతారనే అనుకున్న సమయంలో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తూ.. వెకేషన్ బెంచ్ తమ వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వలేదని, బెయిల్‌ను వ్యతిరేకించే అవకాశం లభించలేదని ఈడీ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఈడీ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి ట్రయల్ కోర్టు బెయిల్ ఉత్తర్వుల అమలు వద్దని ఆదేశాలిచ్చింది. మంగళవారం(25న) కేజ్రీవాల్ బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు ఆయన జైల్లోనే ఉండాలని జస్టిస్ సతీష్ కుమార్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.

ఆర్డర్‌ అప్‌లోడ్‌ కాకముందే.. కోర్టుకెళ్లిన ఈడీ: సునీతా కేజ్రీవాల్

మరోవైపు, ఈ పరిణామాలపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టు వెబ్‌సైట్‌లో బెయిల్ ఆర్డర్‌ను అప్‌లోడ్ చేయకమునుపే ఈడీ అధికారులు కేజ్రీవాల్ బెయిల్‌ను సవాల్ చేస్తూ స్టే కోసం హైకోర్టుకు వెళ్లారన్నారు. దేశంలో నియంతృత్వం అన్ని హద్దులను దాటేసిందని, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిని కేంద్ర దర్యాప్తు సంస్థలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా చూస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 


Similar News