కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆప్ ఆరోపణలు ఖండించిన తీహార్ జైలు అధికారులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను తీహార్ జైలు అధికారులు ఖండించారు. కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.

Update: 2024-07-15 07:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను తీహార్ జైలు అధికారులు ఖండించారు. కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఖైదీల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని.. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు జరుపుతున్నామని జైలు అధికారులు వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకే ఆహారాన్ని తింటున్నారని అన్నారు. "కొంచెం బరువు తగ్గినప్పటికీ, వైటల్స్ సాధారణంగానే ఉన్నాయి. అతని వైద్యసమస్యలకు తగినట్లే అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అని జైలు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్య స్థితిపై ఢిల్లీ మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలు చేసిన వాదనలు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. జైలు పరిపాలనను అణగదొక్కడానికి తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జూన్ 2న 63.5 కిలోల బరువున్న కేజ్రీవాల్.. జులై 14 నాటికి 61.5 కిలోలు తగ్గినట్లు తెలిపారు. జూన్ 2 నుండి జూలై 14 వరకు ప్రతిరోజు రికార్డు చేసిన కేజ్రీవాల్ వెయిట్ చార్ట్ ని అధికారులు బహిర్గతం చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవడాని, అవగాహన కోసం అధికారులకు అందించేందుకు ఈ చార్ట్ రూపొందించినట్లు తెలిపారు.

జైలు అధికారులపై ఫైర్ అయిన ఆప్

కేజ్రీవాల్ బరువు గురించి ఆరోపణలు చేసిన ఆప్ రాజ్యసభ ఎంపీ తీహార్ జైలు అధికారులపై మరోసారి నిప్పులు చెరిగారు. ఖైదీగా ఉన్న కేజ్రీవాల్ వైద్య నివేదికను విడుదల చేసి జైలు అధికారులు నేరానికి పాల్పడ్డారని అన్నారు. "ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది. ఆయన వేగంగా బరువు తగ్గుతున్నారు. హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నారు. అతని రక్తంలో చక్కెరస్థాయిలు పడిపోయాయి. ఇది మరణానికి దారితీయవచ్చు" అని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఇది కేజ్రీవాల్ ను హత్య చేసే కుట్ర అని పైర్ అయ్యారు. కేజ్రీవాల్ ఆరోగ్యంతో ఆడుకోవద్దని కేంద్రాన్ని కోరారు.


Similar News