Arvind Kejriwal : తిహార్ జైలులో టార్చర్ చేశారు.. నేను హర్యానా బిడ్డనని వాళ్లకు తెలియదు : కేజ్రీవాల్
దిశ, నేషనల్ బ్యూరో : తిహార్ జైలులో ఉండగా తనను మానసికంగా, శారీరకంగా టార్చర్ చేసేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యత్నించిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో : తిహార్ జైలులో ఉండగా తనను మానసికంగా, శారీరకంగా టార్చర్ చేసేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యత్నించిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ సర్కారు అన్ని విధాలుగా యత్నించిందని మండిపడ్డారు. హర్యానాలోని రెవారీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనొక షుగర్ రోగిని. నాకు రోజూ నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. అయితే వాళ్లు నాకు ఇంజెక్షన్లు ఇవ్వకుండా టార్చర్ చేశారు. తద్వారా నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నించారు. అయితే నేను హర్యానా బిడ్డను అని వాళ్లకు తెలియదు. హర్యానా బిడ్డను ఎవరూ ఓడించలేరు’’ అని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
‘‘ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హర్యానాలోనూ ఆప్ ప్రభుత్వమే ఏర్పడుతుందేమో అనే బెంగ ప్రధాని మోడీకి ఉంది’’ అని ఆయన చెప్పారు. ‘‘కేజ్రీవాల్‌ను జైల్లో వేసి ఢిల్లీలోని 700 ప్రభుత్వ స్కూళ్లను మూసేసే కుట్ర చేస్తున్నారు. దేశ ప్రధాని స్థానంలో ఉన్నవాళ్లు ఇలా ఆలోచించకూడదు’’ అని ఆప్ చీఫ్ విమర్శించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా ఆప్ అవతరించబోతోందని, తమ మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబరు 5న జరగనుంది. అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.