కుటుంబంతో కలిసి అయోధ్య రామమందిర్‌కు అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ సీఎం కూడా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి సోమవారం(ఫిబ్రవరి 12) అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి సోమవారం(ఫిబ్రవరి 12) అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేజ్రీవాల్ భార్య, ఆయన తల్లిదండ్రులతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా రామమందిరాన్ని సందర్శించనున్నారని వారు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గత నెల జనవరి 22 న రామమందిర్ శంకుస్థాపన కార్యక్రమం జరగగా, ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు వీవీఐపీలు పాల్గొన్నారు. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి హాజరు కాలేదు.
శంకుస్థాపనకు కొద్ది రోజుల ముందు కేజ్రీవాల్‌ని ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందిందా అని ప్రశ్నించగా.. తనకు అధికారికంగా ఆహ్వానం అందలేదని, తర్వాత కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నానని గతంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. రామమందిర్ ప్రారంభం తర్వాత దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాది మంది ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు రామమందిరాన్ని సందర్శిస్తున్న వారి జాబితాలో ఉన్నారు.