Malaria free: 2030 నాటికి మలేరియా రహిత భారత్.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ
2030 నాటికి భారత్ మలేరియా రహిత దేశంగా మారుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: 2030 నాటికి భారత్ మలేరియా రహిత(Malaria free) దేశంగా మారుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాధి నిర్మూలనకు ప్రస్తుతం ఎంతో కృషి జరుగుతోందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గత 75 ఏళ్లలో మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్‌లో మలేరియా కేసుల సంఖ్య 7.5 కోట్లు ఉండగా 8లక్షల మరణాలు సంభవించాయని తెలిపింది. కానీ 2023 నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు తగ్గగా మరణాల సంఖ్య 83కి తగ్గిందని పేర్కొంది. అనేక తీవ్ర ప్రయత్నాల వల్ల భారత్ మలేరియా కేసులను తగ్గించిందని స్పష్టం చేసింది. 97 శాతం కేసులను నియంత్రించగలిగిందని తెలిపింది. గతేడాది వివిధ రాష్ట్రాల్లోని 122 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపింది. 2017, 2023 మధ్య మలేరియా కేసులు, మలేరియా సంబంధిత మరణాలు గణనీయంగా తగ్గడం దేశం సాధించిన విజయాల్లో ఒకటని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక ప్రకారం.. భారత్ హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ (HBHI) సమూహం నుండి నిష్క్రమించిందని, ఇది మలేరియాకు వ్యతిరేకంగా భారత్ చేసిన పోరాటానికి గుర్తింపు వంటిదని కొనియాడింది. ఇది ఇలాగే కొనసాగితే 2030 వరకు భారత్ మలేరియా రహిత దేశంగా ఆవతరించడం ఖాయమని తెలిపింది.