అనాథ యువతి పెళ్లి కోసం అబ్బాయిలకు ఇంటర్వ్యూ.. ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసి..

అమ్మాయికి పెళ్లి చేయడం కోసం వరుడి గురించి తెలిసిన వారి ద్వారా లేదా? మ్యాట్రీమోని వెబ్‌సైట్లలో తల్లిదండ్రులు వెతుకుతారనే విషయం తెలిసిందే. కానీ..

Update: 2024-02-17 13:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అమ్మాయికి పెళ్లి చేయడం కోసం వరుడి గురించి తెలిసిన వారి ద్వారా లేదా? మ్యాట్రీమోని వెబ్‌సైట్లలో తల్లిదండ్రులు వెతుకుతారు. అబ్బాయిల గుణగణాలు, ఆర్థిక పరిస్థితిని బట్టి వరుడిని ఎంపిక చేస్తారు. అయితే ఇందుకు కొంచెం భిన్నంగా ఇటీవల హిందూ సంప్రదాయ పద్ధతిలో హర్యానా రాష్ట్రంలో ఓ ఆదర్శ వివాహం జరిగింది. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో అనాథ ఆశ్రమంలో పెరిగిన వదువు కరిష్మాకు ఇటీవల అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. వదువు కరిష్మా చిన్న తనంలో ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు తనను అనాధాశ్రమంలో వదిలేసి పోయారు. అప్పటి నుంచి కరిష్మా ఆలనపాలన రోహ్‌తక్ బాల్ భవన్ ఆశ్రమం చూసుకునేది. ఆమెను ఇంటర్ వరకు చదివించారు. తర్వాత ఆమె ఇష్టం మేరకు పెళ్లి చేయాలనుకున్నారు. అయితే ఆ అమ్మాయిని మంచిగా చూసుకునే భర్త కోసం ఇంటర్వ్యూల ద్వారా వరుడిని ఎంపిక చేయడంతో ప్రత్యేకత సంతరించుకుంది.

ఇంటర్వ్యూ కోసం 10 మంది దరఖాస్తులు

వదువు కరిష్మా వివాహం కోసం వార్తాపత్రికలో ప్రకటన ప్రచురించారు. దీంతో ఇంటర్వ్యూ కోసం దాదాపు పది మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి సీటీఎం ముకుంద్ తన్వర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అమ్మాయి, వరుడి మధ్య పరిచయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కమిటీ ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి చేసింది. ఇందులో ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసి.. రోహ్‌తక్‌లోని రాంకపురాకు చెందిన నిక్కూ గులియా ఎట్టకేలకు ఎంపికయ్యారు.

వరుడు నిక్కు ఒక టెలికాం కంపెనీలో సూపర్‌వైజర్, అతని తండ్రి రవాణా శాఖలో పనిచేస్తుండగా తల్లి గృహిణి. కరిష్మా వివాహానికి ముందు, డీసీ రోహ్‌తక్ ద్వారా వివాహానికి సంబంధించిన కార్డులను ముద్రించి, ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. 'మైక్రో ఫౌండేషన్' అనే ఎన్జీవో ఈ పెళ్లి ఖర్చు లన్నింటినీ భరించింది. అయితే ఈ వివాహంలో యువతికి మేనమామగా స్థానిక బీజేపీ నాయకుడు అజయ్ ఖుండియా మారి పెళ్లి జరిపించారు. ఒక అనాథ బాలికకు ఆమె పెళ్లిలో మామయ్యగా మారే అదృష్టం నాకు లభించినందుకు సంతోషంగా ఉందని నేత ఖుండియా చెప్పారు.

వధువు కరిష్మా మాట్లాడుతూ.. తన పెళ్లికి కుటుంబ సభ్యులంతా అడ్మినిస్ట్రేషన్ రూపంలో హాజరు కావడం తన అదృష్టమని తెలిపింది. "ఇక్కడ ఉన్న సభ్యులందరూ నా కుటుంబం లాంటి వారు," ఆమె చెప్పింది. వరుడు నిక్కు విషయానికొస్తే, తన కుటుంబ సభ్యుల చురుకైన మద్దతుతో తన జీవితమంతా కరిష్మాతో గడపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఈ పెళ్లికి స్థానిక జిల్లా సెషన్స్ జడ్జి, డిప్యూటీ కమిషనర్ వివాహానికి హాజరై వధువును ఆశీర్వదించారు. మరోవైపు నగరానికి చెందిన పారిశ్రామికవేత్తతో పాటు, హర్యానా స్టేట్ చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్‌పర్సన్ రంజితా మెహతా కూడా వివాహ వేడుకకు హాజరయ్యారు.

Tags:    

Similar News