Amritsar: అమృత్‌సర్ ఆలయంలో బాంబు పేలుడు.. హ్యండ్ గ్రనేడ్స్ విసిరిన దుండగులు
పంజాబ్‌లోని అమృత్‌సర్ ఖాండ్వాలా ప్రాంతంలో ఉన్న ఠాకూర్ద్వారా ఆలయంలో బాంబు పేలుడు సంభవించింది.
దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని అమృత్‌సర్ (Amritsar) ఖాండ్వాలా ప్రాంతంలో ఉన్న ఠాకూర్ద్వారా ఆలయంలో బాంబు పేలుడు సంభవించింది. శనివారం తెల్లవారుజామున ఆలయ సమీపంలోని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు హ్యాండ్ గ్రనేడ్స్ విసిరారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలుకానప్పటికీ ఆలయ గోడలు దెబ్బతినగా, కిటీకీ అద్దాలు పగిలిపోయాయని అధికారులు తెలిపారు. పేలుడు టైంలో టెంపులో ఉన్న పూజారి సురక్షితంగా బయటపడ్డట్టు వెల్లడించారు. ఒక్కసారిగా బాంబు పేలుడు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
దాడికి ముందు ఇద్దర గుర్తు తెలియని దుండగులు ఆలయానికి వస్తున్నట్టు కనిపిస్తోంది. టెంపుల్ దగ్గరకు రాగానే కొన్ని సెకన్ల వాపు వేచి ఉన్న దుండగులు ఆలయం వైపుగా కొన్ని పేలుడు పదార్థాలు విసిరేసినట్టు ఉంది. దీని ఆధారంగానే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా దాడుల వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ (Gurprith singh Bhullar) తెలిపారు. పాక్ అప్పుడప్పుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. పేలుడు పదార్థం స్వభావాన్ని ఇంకా ధ్రువీకరించలేదని, ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు.
పంజాబ్‌ను భయపెట్టడానికే: సీఎం భగవంత్ మాన్
బాంబు పేలుడు ఘటనలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagavanth mann) స్పందించారు. రాష్ట్ర వాతావరణాన్ని చెడగొట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘కొన్ని దుష్టశక్తులు పంజాబ్‌ను కలవరపెట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాయి. మాదకద్రవ్యాలు కూడా దానిలో భాగమే. ఈ కేసుల్లో పోలీసులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతల పరంగా పంజాబ్ సురక్షితంగా ఉంది’ అని తెలిపారు. పాకిస్తాన్ నుంచి నిరంతరం డ్రోన్లు వస్తున్నాయని, అలాంటి ప్రయత్నాలు ఇంతకు ముందు కూడా జరిగాయని చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ.. ఆప్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.