Bombay hc: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు బాంబే హైకోర్టు నోటీసులు.. కారణమిదే?

ప్రభుత్వ ప్రకటనలలో ఒక మహిళ ఫొటోను ఆమె అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ఉపయోగించడాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా ఖండించింది.

Update: 2025-03-17 18:21 GMT
Bombay hc: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు బాంబే హైకోర్టు నోటీసులు.. కారణమిదే?
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వ ప్రకటనలలో ఒక మహిళ ఫొటోను ఆమె అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ఉపయోగించడాన్ని బాంబే హైకోర్టు (Bombay High court) తీవ్రంగా ఖండించింది. దీనిని వాణిజ్య దోపిడీగా అభివర్ణించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర (Maharashtra), తెలంగాణ (Telangana), కర్ణాటక (Karnataka), ఒడిశా (Odisha) రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పర్మిషన్ లేకుండా తన ఫొటోలను వాడుకున్నారని ఆరోపిస్తూ నమ్రతా అంకుష్ కావ్లే అనే మహిళ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక ఫొటో గ్రాఫర్ తుకారాం కార్వే అనే వ్యక్తి తన అనుమతి లేకుండా ఫొటో తీసి Shutterstock.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆ ఫొటోను నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, కొన్ని ప్రయివేట్ సంస్థలు తమ వెబ్‌సైట్‌లు, హోర్డింగ్‌లు, ఇతర ప్రకటనలలో అనధికారికంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. వెంటనే తన ఫొటొను ఉపయోగించడం నిలిపివేసేలా ఆర్డర్స్ జారీ చేయాలని కోరారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ జీఎస్ కులకర్ణి, జస్టిస్ అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు ప్రస్తుత సాంకేతిక, సోషల్ మీడియా యుగంలో చాలా తీవ్రమైనవని పేర్కొంది. పిటిషనర్ ఫొటోను వాణిజ్యపరంగా ఉపయోగించుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ఈ మేరకు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, అమెరికాకు చెందిన షట్టర్ స్టాక్ కంపెనీకి, కాంగ్రెస్ తెలంగాణ విభాగానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News