Aurangzeb: ఔరంగజేబు సమాధి వివాదం.. నాగ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
ఔరంగాజేబు సమాధి వివాదంపై మహారాష్ట్రలోని నాగ్ పూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఔరంగాజేబు (Aurangazeb) సమాధి వివాదంపై మహారాష్ట్రలోని నాగ్ పూర్ (Nagpur) లో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ నగర్ నుంచి ఔరంగాజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ భజరంగ్ దళ్ సభ్యులు మహల్ ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఔరంగాజేబు దిష్టి బొమ్మను సైతం దహనం చేశారు. అయితే నిరసనకారులు దిష్టిబొమ్మతో పాటు ముస్లిం సమాజ పవిత్ర గ్రంథం ఖురాన్‌ను సైతం తగులబెట్టారని సోషల్ మీడియా (Social media)లో పుకార్లు వ్యాపించాయి. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య హింస నెలకొన్నట్టు పోలీసులు తెలిపారు. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా నలుగురికి గాయాలయ్యాయి. అనేక వాహనాలను దుండగులు తగుళబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు.
చిట్నిష్ పార్క్ నుంచి శుక్రవారీ తలావ్ రోడ్డు బెల్ట్ వరకు హింస ఎక్కువగా ప్రభావితమైందని అధికారులు తెలిపారు. అయితే మత గ్రంథాన్ని తగుళబెట్టారనే ఆరోపణలను బజరంగ్ దళ్ నేతలు తోసిపుచ్చారు. తమ ప్రదర్శనలో భాగంగా ఔరంగజేబు దిష్టిబొమ్మను మాత్రమే దహనం చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) స్పందించారు. ప్రజలు పుకార్లను నమ్మొద్దని సూచించారు. ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అల్లర్ల నేపథ్యంలో నాగ్ పూర్‌లో భారీగా బలగాలను మోహరించారు.