5 లక్షల మంది వలసదారులకు ఝలక్
మంగళవారం ఫెడరల్ రిజిస్టర్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఈ ఆర్డర్‌ను ప్రచురించనుంది.

- చట్టపరమైన హోదా రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం
- దేశం విడిచి వెళ్లడానికి నాలుగు వారాల సమయం
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో హ్యుమానిటీ పెరోల్ మీద ఉంటున్న నాలుగు దేశాల వలసదారులకు ఉన్న చట్టపరమైన హోదాను రద్దు చేసింది. వారందరూ అమెరికాను విడిచి వెళ్లడానికి నాలుగు వారాల సమయాన్ని ఇచ్చింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్నిచేపడతానని గతంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చే వలసదారులను అరికట్టాలని ట్రంప్ నిర్ణయించారు. 2022 అక్టోబర్‌లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ తీసుకొని వచ్చిన హ్యుమానిటీ పెరోల్ అనే పథకం ద్వారా 5,32,000 మంది క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వాన్లు, వెనుజులా పౌరులు అమెరికాకు వచ్చారు. పౌర హక్కుల హననం తీవ్రంగా జరుగుతున్న దేశాల నుంచి అమెరికాకు వస్తున్న వారిని తాత్కాలిక ప్రాతిపతికన అనుమతించాలని అప్పట్లో హ్యుమానిటీ పెరోల్‌ను అమలు చేశారు. అయితే ఈ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం ఫెడరల్ రిజిస్టర్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఈ ఆర్డర్‌ను ప్రచురించనుంది. ఆ తర్వాత 30 రోజుల్లో 5,32,000 మంది తమ చట్టపరమైన హక్కును కోల్పోనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అమెరికాలో ప్రవేశించిన వలసదారులు ఏప్రిల్ 24 నాటికి అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక వేళ వారు అమెరికాలో ఇమ్మిగ్రేషన్ హోదాను పొంది ఉంటే.. వారికి ఈ ఉత్తర్వులు వర్తించవని హోం ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. రద్దీగా ఉండే అమెరికా-మెక్సికో సరిహద్దుపై ఒత్తిడిని తగ్గించడానికి సురక్షితమైన, మానవీయ మార్గంగా బైడెన్ ఈ పథకాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఇది తాత్కాలిక పథకమే అని హోం ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అమెరికాలో అర మిలియన్ కంటే ఎక్కువ మంది వలసదారులు ప్రవేశించారు. అయితే కేవలం 75,000 దరఖాస్తులు మాత్రమే ఆశ్రయం కోసం అందాయని ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోలెట్ గ్లేజర్ చెప్పారు.