ఉక్రెయిన్ వివాదంపై నిష్పాక్షికంగా వ్యవహరించాం
2023లో ఇజ్రాయేల్‌పై హమాస్ ఆకస్మిక దాడితో ప్రారంభమైన మిడిల్ ఈస్ట్ వివాదం తర్వాత.. ఇజ్రాయేల్, ఇరాన్‌లతో భారత్ తమ వ్యూహాత్మక సంబంధాలను సమతుల్యం చేసుకుందని జై శంకర్ అన్నారు.

- ఇతర దేశాలు భావోద్వేగంతో చూశాయి
- రష్యా, ఇజ్రాయేల్, ఇరాన్‌లో కలిసి పని చేయగలం
- ట్రంప్ చర్యల తర్వాత టారిఫ్ వార్‌పై ఇండియా పోరాడుతోంది
- ఎంఈఏ ఎస్. జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ వివాదం విషయంలో భారత్ నిష్పాక్షికంగా వ్యవహరించింది. ఉక్రెయిన్-రష్యా యుద్దంలో పశ్చిమ, యూరోపియన్ దేశాల మాదిరిగా కాకుండా.. భారత్ శాంతి వైపు నిలబడిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి (ఎంఈఏ) జై శంకర్ అన్నారు. ప్రస్తుతం భౌగోలికంగా రాజకీయ సంక్షోభాల నెలకొన్న పరిస్థితుల్లో ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయేల్, ఇరాన్‌లతో సంబంధాలు పెట్టుకోగల అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటని జై శంకర్ శనివారం చెప్పారు. భారత్ క్వాడ్, బ్రిక్ దేశాలతో పాటు ఇజ్రాయేల్, ఉక్రెయిన్, రష్యా, ఇరాన్‌లతో సత్సంబంధాలు కలిగి ఉంది. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అనే నినాదాన్ని విదేశాంగ విధానానికి కూడా వర్తింప చేస్తున్నామని జై శంకర్ చెప్పారు.
2023లో ఇజ్రాయేల్‌పై హమాస్ ఆకస్మిక దాడితో ప్రారంభమైన మిడిల్ ఈస్ట్ వివాదం తర్వాత.. ఇజ్రాయేల్, ఇరాన్‌లతో భారత్ తమ వ్యూహాత్మక సంబంధాలను సమతుల్యం చేసుకుందని జై శంకర్ అన్నారు. భారత్‌కు ఇజ్రాయేల్ కీలక రక్షణ రంగ సరఫరాదారునిగా ఉన్నప్పటికీ.. ముడి చమురు కోసం ఇరాన్‌పై ఆధారపడుతున్నామని జై శంకర్ గుర్తు చేశారు. భారత్ ఇలాంటి తటస్థ వైఖరి అవలంభించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ప్రశంసించారని అన్నారు. నేడు ప్రపంచం పారిశ్రామిక విధానాలు, ఎగుమతి నియంత్రణలు, టారిఫ్ వార్‌లపై పోరాడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదం నుంచి తప్పించడంపై ఆందోళన నెలకొని ఉంది. దీనికి పరిష్కారం మరింత విభిన్నమైన వస్తువుల తయారీనే అని జై శంకర్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర టారిఫ్‌ల చర్య కారణంగా ప్రపంచ వాణిజ్యం సంక్షోభానికి దారి తీసిందని చెప్పారు. ఈ టారిఫ్‌లపై దౌత్య పరంగా భారత్ పోరాడుతుందని అన్నారు.
యూరోపియన్ యూనియన్, యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ ముఖ్యమైన చర్చల్లో నిమగ్నమై ఉందని శంకర్ చెప్పారు. భారత్‌ను ప్రపంచ సామర్థ్య కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని జై శంకర్ పునరుద్ఘాటించారు. మనం మరింత సాంకేతికత, సేవల ఆధారిత భవిష్యత్‌ను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని జై శంకర్ అన్నారు.