మోడీ గెలిస్తే.. వాళ్ల ఖేల్ ఖతం : అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓటర్లు ఆశీర్వదిస్తే.. రెండేళ్లలోనే నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓటర్లు ఆశీర్వదిస్తే.. రెండేళ్లలోనే నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలోని మూడింట ఒక వంతు భూభాగంలో నక్సలిజం ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు హతమైన ఘటనపై కేంద్ర హోంమంత్రిని ప్రశ్నించగా.. ‘‘గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత విషయంలో కేంద్ర సర్కారుకు సహకరించలేదు. రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 86 మంది మావోయిస్టులను హతమార్చాం. 126 మందిని అరెస్టు చేశాం. 250 మందికి పైగా లొంగిపోయారు’’ అని అమిత్ షా వివరించారు. మావోయిజం ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలకే పరిమితమైందన్నారు. కాంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘‘ప్రతి ఒక్కరిని అనుమానించడం, నిజాయితీని శంకించడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారింది. దేవుడు ఒకరిని శిక్షించాలని నిర్ణయించినప్పుడు.. ఆ వ్యక్తికి తెలివి లేకుండా చేస్తాడని రామచరిత్ మానస్‌లో తులసీదాస్ జీ చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు కూడా ఇదే విధంగా తెలివిని కోల్పోయి ఉంటారని నేను నమ్ముతున్నా’’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు.