ఇండియా కూటమికి బీటలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ఒకవైపు సతమతం అవుతుంటే.. మరోవైపు మిత్రపక్షాల నుంచి ఆగ్రహ సెగలను ఎదుర్కోవాల్సి వస్తున్నది.

Update: 2024-10-09 20:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ఒకవైపు సతమతం అవుతుంటే.. మరోవైపు మిత్రపక్షాల నుంచి ఆగ్రహ సెగలను ఎదుర్కోవాల్సి వస్తున్నది.ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ అవకాశవాద ధోరణితో వ్యవహరిస్తున్నదని ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. హర్యానాలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మిత్రపక్షమైన ఆప్‌ను కాంగ్రెస్ దూరం పెట్టిందని, అదే జమ్ము కశ్మీర్‌లో బలం లేదని ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌తో చేతులు కలిపిందని విమర్శలు చేస్తున్నాయి. హర్యానాలో ఆప్‌తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బరిలోకి దిగి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని, కేవలం అవకాశవాదంతోనే ఒంటరిగా బరిలోకి దిగి బొక్కాబోర్లా పడిందని మండిపడుతున్నాయి. అంతేకాదు, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సోలోగా పోటీ చేస్తామని ఒక వైపు ఆప్ ప్రకటించగా.. సమాజ్‌వాదీ పార్టీ యూపీ బైపోల్స్ కోసం ఏకంగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించేసింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎస్పీ ఈ ప్రకటన చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహమే ఉన్నదని చెబుతున్నారు.

కూటమిగా పోటీ చేస్తే..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 37 సీట్లు సొంతం చేసుకుంది. ఆప్ బోణీ కొట్టలేదు. బీజేపీకి 39.94 శాతం ఓటు షేర్ దక్కగా.. కాంగ్రెస్‌కు 39.09 శాతం వచ్చింది. ఆప్‌కు 1.79 ఓటు శాతం దక్కింది. అదే ఆప్, కాంగ్రెస్ కూటమిగా బరిలోకి దిగి ఉంటే 40 శాతానికి మించి ఓటు శాతం నమోదయ్యేదని, సీట్లు కూడా అనూహ్యంగా పెరిగి ఉండేవని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి.

కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి:

హర్యానాలో కాంగ్రెస్, ఆప్ సొంతంగా బరిలోకి దిగడానికి ముందు పొత్తు కోసం చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ పట్టువిడవలేదు. దీంతో పొత్తు కుదరలేదు. ఎవరికి వారే, యమునా తీరే అన్నట్టుగా రెండు పార్టీలు సొంతంగా బరిలోకి దిగాయి. బీజేపీ పదేళ్లు అధికారంలో ఉన్నఫలితంగా నెలకొనే ప్రభుత్వ వ్యతిరేకత, సాగు చట్టాలపై రైతుల ఆందోళన, రెజ్లర్ల ధర్నా, అగ్నివీర్‌పై నిరసనలు వెరసి కమలదళం మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని చాలా మంది భావించారు. కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఉన్నదన్న స్థితిలో హస్తం పార్టీ వేరే పార్టీకి సీట్లు కేటాయించడానికి వెనుకడుగేసింది. కానీ, అది మొదటికే మోసంగా మారింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఆగ్రహం కూడా అందుకే. అదే జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ అప్రోచ్ వేరుగా ఉన్నదని వేలెత్తి చూపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు అవసరముంటేనే ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకుంటున్నదని, లేదంటే కనీసమాత్రమైనా సానుకూలత ప్రదర్శించడం లేదని ప్రధానంగా ఆరోపిస్తున్నాయి.

ఆప్ సంచలనం:

వచ్చే ఏడాది తొలినాళ్లలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని, అతివిశ్వాసమున్న కాంగ్రెస్‌ను, అహంకారపూరిత బీజేపీని ఓడించే సామర్థ్యం తమకు ఉన్నదని ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పష్టం చేశారు. ‘ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు గత పదేళ్లలో ఒక్క సీటు కూడా లేదు. కానీ, లోక్ సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మేం మూడు సీట్లు ఇచ్చాం. కానీ, అదే కాంగ్రెస్ హర్యానాలో మాతో పొత్తుకు నిరాకరించింది. హర్యానాలో కూటమి కోసం చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ నిష్ఫలం చేసింది’ అని వెల్లడించారు. హర్యానా ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమికి తగిలిన బలమైన దెబ్బ ఇది.

మీకు మీరే.. మాకు మేమే..

కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ కూడా షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో పది అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరగాల్సి ఉన్నాయి. ఇందుకోసం సీట్ల పంపకాలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఐదు సీట్లు కావాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబడుతుండగా.. మూడు సీట్ల వరకు ఇస్తామని సమాజ్‌వాదీ చెబుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, హర్యానా ఫలితాల తర్వాత కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే డైరెక్ట్‌గా ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది సమాజ్‌వాదీ పార్టీ. కనీసం ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇంకా వెలువడలేదు. తాము చెప్పినట్టుగా వింటే ఓకే, లేదంటే కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించాల్సిన అవసరం లేదనే ధోరణిలో ఎస్పీ వ్యవహరిస్తుండటం గమనార్హం.

తగ్గించుకుంటే మంచిది..

ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కూటమిలో కీలకంగా ఉన్న శివసేన (యూబీటీ) కూడా హస్తం పార్టీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతోనే ఎన్నికల్లో ఓడిపోతున్నదని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇలాగే ఓడిందని, ఇప్పుడు హర్యానా ఇందుకు తాజా నిదర్శనమని ఆరోపించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది.

అర్థం చేసుకోండి

ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌ చిన్నచూపు చూస్తున్నదని, అవసరానికి వాడుకుంటున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయాన్ని ప్రాంతీయ పార్టీలు తెలుసుకోవాలని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. ‘మేం గెలుస్తామని అనిపిస్తే వేరే పార్టీకి అవకాశం ఇవ్వం. కానీ, మాకు పట్టులేని చోట ప్రాంతీయ పార్టీలు తప్పకుండా మాతో పొత్తుపెట్టుకోవాలి అనేది కాంగ్రెస్ యాటిట్యూట్‌గా ఉన్నది. అహంకార, ప్రాంతీయ పార్టీలపై చిన్నచూపే కాంగ్రెస్‌ను ఓడించింది’ అని పేర్కొన్నారు.


Similar News