కడుపులో కలియతిరుగుతూ బొద్దింక.. ఏం జరిగిందంటే?

ఓ బొద్దింక 23 ఏళ్ల యువకుడి కడుపులోకి వెళ్లింది. వైద్యులు ఎండోస్కోపీ ద్వారా తొలగించారు.

Update: 2024-10-10 13:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఓ బొద్దింక 23 ఏళ్ల యువకుడి కడుపులోకి వెళ్లింది. ఎలా వెళ్లిందో తెలియదుగానీ.. చిన్న ప్రేవుల్లో కదులుతూ తీవ్రమైన నొప్పిని కలుగజేసింది. రెండు మూడు రోజులుగా విపరీతమైన కడుపు నొప్పి. తిన్న ఆహారం జీర్ణం కాలేదు. భరించలేని నొప్పితో ఆ యువకుడు ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో చేరాడు. వైద్యులు పరీక్షలు చేయగా.. పేగుల్లో ప్రాణాలతో ఉన్న ఓ బొద్దింక ఉన్నట్టు గుర్తించారు. అది ప్రాణాంతకం. దీంతో వైద్యులు నిమిషాల వ్యవధిలోనే ఎండోస్కోపీ ప్రక్రియ చేపట్టారు. పేషెంట్‌కు ఎలాంటి ప్రమాదం జరగకుండా మూడు సెంటిమీటర్ల పొడవున్న బొద్దింకను ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు.

కడుపు నొప్పి, జీర్ణ సమస్యతో 23 ఏళ్ల యవకుడు ఢిల్లీలో వసంత్ కుంజ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో చేరగా డాక్టర్ శుభం వత్స్య సారథ్యంలోని గ్యాస్ట్రోఎంట్రాలజీ టీమ్ చికిత్స అందించింది. అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ చేశారు. అప్పర్ జీఐ ట్రాక్ట్‌ను పరీక్షిస్తుండగా చిన్న ప్రేవుల్లో ప్రాణాలతో ఉన్న ఓ బొద్దింక ఉన్నట్టు గుర్తించారు. వైద్యులు వెంటనే పది నిమిషాల ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా బొద్దింకను తొలగించారు. ప్రేవుల్లో ప్రాణాలతో ఉన్న బొద్దింక ఉండటం ఆ పేషెంట్ ప్రాణాలకే ప్రమాదకరమని, ప్రాణాంతకమైన ఆ ప్రాణిని ఎండోస్కోపీ ద్వారా తొలగించామని వైద్యులు వివరించారు. ఆహారం తింటూ ఉండగా ఆ బొద్దింకను మింగి ఉండాలి.. లేదా నిద్రిస్తున్నప్పుడు నోటిలోకి బొద్దింక వెళ్లి ఉండాలి అని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News