ఆయన తిరుగుబాటు వ్యక్తిగతమైంది.. ఎన్సీపీతో సంబంధం లేదు : Sharad Pawar

మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటు పూర్తిగా వ్యక్తిగతమైందని.. దానికి పార్టీతో సంబంధం లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు.

Update: 2023-07-02 14:31 GMT

ముంబై : మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటు పూర్తిగా వ్యక్తిగతమైందని.. దానికి పార్టీతో సంబంధం లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. "ఎన్‌సీపీ ఫినిష్డ్ పార్టీ అని రెండు రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్ చేశారు" అని పేర్కొన్నారు. "ఎన్‌సీపీని ఉద్దేశించి ప్రధాని మోడీ ఇటీవల మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, అవినీతి ఆరోపణల గురించి ఆయన ప్రస్తావించారు.

ఇప్పుడు మా పార్టీ నుంచి వాళ్లు (తిరుగుబాటు ఎమ్మెల్యేలు) ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరడంతో అన్ని అభియోగాలు క్లియర్ అయ్యాయని స్పష్టమైంది. నా సహచరులు కొందరికి పదవులు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. నేను ప్రధానికి రుణపడి ఉంటాను" అని శరద్ పవార్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడారు.

“నా కుటుంబం, ఇల్లు చీలిపోయాయని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే ఈ సమస్య నా ఇంటికి సంబంధించినది కాదు. ఇది రాష్ట్ర ప్రజల సమస్య. వెళ్లిపోయిన ఎమ్మెల్యేల భవిష్యత్తు గురించే నేను ఆందోళన చెందుతున్నాను. దీని క్రెడిట్‌ ను ప్రధాని మోడీకి అందించాలని అనుకుంటున్నాను. రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ చేసిన ప్రకటనతో ఈడీ కేసులను ఎదుర్కొంటున్న కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు అసౌకర్యానికి, ఆందోళనకు గురయ్యారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు వెళ్లిపోయారు” అని శరద్ పవార్ తెలిపారు. "అజిత్ పవార్ ఎన్డీఏలో చేరడం అనేది గూగ్లీ వేయడం లాంటి చిన్న విషయం కాదు.. ఇదొక లూటీ లాంటి చర్య" అని విమర్శించారు.

"నాకు ఇది కొత్త విషయం కాదు. 1980వ దశకంలో నేను ఒక జాతీయ పార్టీకి మహారాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వారిలో అందరూ వెళ్ళిపోయి, ఆరుగురే మిగిలారు. కానీ నేను మళ్ళీ ఆ సంఖ్యను పెంచాను. నన్ను విడిచిపెట్టిన వాళ్ళు వారి నియోజకవర్గాల్లో ఓడిపోయారు" అని శరద్ పవార్ అన్నారు. ఇప్పుడు మీ పార్టీకి విశ్వసనీయమైన వ్యక్తి ఎవరు అని ఈసందర్భంగా మీడియా ప్రశ్నించగా శరద్ పవార్ చేయి పైకెత్తి.. 'శరద్ పవార్' అని నవ్వుతూ బదులిచ్చారు.

శరద్ పవార్ ఇంకా మాట్లాడుతూ.. "పార్టీలో కీలక మార్పులు చేసేందుకు జూలై 6న ఒక మీటింగ్‌కు నేను పిలుపు ఇచ్చాను. కానీ ఆ సమావేశం కంటే ముందే కొందరు నేతలు భిన్నమైన వైఖరిని తీసుకున్నారు" అని చెప్పారు. “నాకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా చాలామంది నుంచి కాల్స్ వచ్చాయి. ఏమి జరిగినా నేను చింతించను. రేపు నేను వైబీ చవాన్ (మహారాష్ట్ర మాజీ సీఎం) ఆశీర్వాదం తీసుకుని.. త్వరలో బహిరంగ సభ నిర్వహిస్తాను" అని శరద్ పవార్ వెల్లడించారు.


Similar News