ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన భారీ ప్రమాదం.. దగ్గరగా వచ్చిన రెండు విమానాలు

ముంబై విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం రన్‌వేపై రెండు విమానాలు ఒకదానికొకటి ప్రమాదకరంగా దగ్గరగా వచ్చాయి.

Update: 2024-06-09 08:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం రన్‌వేపై రెండు విమానాలు ఒకదానికొకటి ప్రమాదకరంగా దగ్గరగా వచ్చాయి. రన్‌వేపై ఒక విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మరో విమానం ల్యాండ్ అయింది. అయితే ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వే 27లో ఎయిర్ ఇండియా విమానం 657 తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి టేకాఫ్ అవుతుండగా ఇండోర్‌ నుంచి వస్తున్న ఇండిగోకు చెందిన విమానం 5053 కూడా అదే సమయంలో ల్యాండ్ అయింది. రెండు విమానాలు దగ్గర దగ్గరగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక విమానం ల్యాండ్ అయ్యే టైంలో మరో విమానం అప్పటికే గాల్లోకి ఎగరడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సిబ్బందిని తొలగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ప్రోటోకాల్ ఉల్లంఘనకు దారితీసిన చర్యలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.


Similar News