అసెంబ్లీలో దుమారం.. 'వందేమాతరం' చదివేందుకు మా మతం అనుమతించదు.. ఎస్పీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

"వందేమాతరం చదివి నా తలను దించలేను. అది చదివేందుకు మా మతం అనుమతించదు" అని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆసిమ్ అజ్మీ

Update: 2023-07-19 14:03 GMT

ముంబై : "వందేమాతరం చదివి నా తలను దించలేను. అది చదివేందుకు మా మతం అనుమతించదు" అని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆసిమ్ అజ్మీ మహారాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యపై దుమారం రేగింది. మార్చిలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఘటనకు సంబంధించి బుధవారం అసెంబ్లీలో అటెన్షన్‌ మోషన్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వందేమాతర గీతం ఆలపించాలని ఆజ్మీని అధికార బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. అయితే అందుకు ఆజ్మీ 'నో' చెప్పడంతో సభలో వాగ్వాదం జరిగింది. దేశంలోని కోట్లాది మంది ప్రజల మనోభావాలు వందేమాతరంతో ముడిపడి ఉన్నాయని, వారిని నొప్పించొద్దని ఆజ్మీని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కోరారు.

ఈ క్రమంలో అబూ ఆసిమ్ అజ్మీ మాట్లాడుతూ.. "ఎవరి ముందూ తల వంచేందుకు మా మతం అనుమతించదు. మా అమ్మ ముందు కూడా మేము తల వంచము. నేను వందేమాతరం చదవలేకపోతే.. అది నా దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తగ్గించదు. దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. మీలాగే మేమూ ఈ దేశానికి చెందినవాళ్ళం" అని అన్నారు. ఈ ఏడాది మార్చి 29న ఔరంగాబాద్‌లోని రామమందిరం ఎదుట రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను అబూ ఆసిమ్ అజ్మీ ప్రస్తావిస్తూ.. దేశంలో బతకాలంటే వందేమాతరం చెప్పాలని ఓ వర్గం వారు నినాదాలు చేశారని పేర్కొన్నారు.

దీంతో బీజేపీ, శివసేన (షిండే వర్గం), ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో స్పీకర్ వెల్‌లోకి చొచ్చుకువెళ్లి.. ఆజ్మీ వందేమాతరం చెప్పాల్సిందే అని నినాదాలు చేశారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఎమ్మెల్యేలను శాంతించాలని కోరినప్పటికీ వారు వినకపోవడంతో అసెంబ్లీని వాయిదా వేశారు. సభా కార్యక్రమాలు తిరిగి ప్రారంభమైన వెంటనే ఆజ్మీ చేసిన ప్రకటనపై హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తల్లి ముందు తల వంచవద్దని ఏ మతం చెబుతోందని ప్రశ్నించారు. సభను ప్రారంభించినప్పుడు కూడా వందేమాతర గీతం ఆలపిస్తారన్నారు. ఆజ్మీ చేసిన తరహా ప్రకటనలే దేశంలో ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయని చెప్పారు.


Similar News