Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లో యాంటీ టెర్రర్ ఆపరేషన్

జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) పోలీసులు భారీ యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టారు.

Update: 2024-10-22 08:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) పోలీసులు భారీ యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టారు. అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించి కొత్తగా ఏర్పాటైన ఉగ్రసంస్థ తెహ్రీక్‌ లబైక్‌ యా ముస్లిం (TLM)ను వినాశనం చేసే పనిలో పడ్డారు. టీఎల్ఎం లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని, బాబా హమాస్‌ అనే పాకిస్థానీ దాని కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శ్రీనగర్, గాందర్‌బల్‌, బాందిపొరా, కుల్గామ్, బుడ్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో ఈ సోదాలు జరిగాయి. ఉగ్ర కార్యకలాపాల నిమిత్తం ఇటీవల టీఎల్‌ఎం భారీగా యువతను రిక్రూట్ చేసుకుంటోందని, ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఆ సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఉగ్రనెట్ వర్క్

టీఎల్ఎం సంస్థను నిర్వహిస్తున్న బాబా హమాస్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థికంగా సాయపడటం, యువతను రిక్రూట్ చేసుకోవడంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల సోన్‌మార్గ్‌ వద్ద సొరంగ నిర్మాణ ప్రదేశం వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో నిర్మణ కూలీలు, డాక్టర్ సహా ఏడుగురు చనిపోయారు. ఈకేసుపై ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (NIA) దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాడి చేసినవారు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులేనని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ముష్కరులు ఆ ప్రాంతాన్ని ముందుగానే క్షుణ్నంగా పరిశీలించారని భావిస్తున్నారు. లేదంటే స్థానికులెవరైనా వారికి సహకరించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.


Similar News