Accident: బస్సు బోల్తా పడి నలుగురి మృతి.. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఘటన
ఒడిశాలోని కొండ ప్రాంతమైన కోరాపుట్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని కొండ ప్రాంతమైన కోరాపుట్ జిల్లా (koraput district)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 40 మంది గాయపడ్డారు. సుమారు 50 మందితో కూడిన బస్సు కటక్‌లోని నియాలీ నుంచి గుప్తేశ్వర్ ఆలయానికి వెళ్తోంది. ఈ క్రమంలోనే బోయిపరిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుప్తేశ్వర్ సమీపంలోని డోక్రిఘాట్ వద్ద బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మరణించగా మరో 40 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒడిశా సీఎం మోహన్ చరణ్ రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.