వరదల అంచనాకు కేంద్రం సరికొత్త మిషన్.. ఇకపై పక్కాగా వాతావరణ అంచనా

మొన్న వయనాడ్.. నిన్న ఖమ్మం.. వరంగల్, విజయవాడ నగరాల్లో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. భారీ వర్షాలు, వరదలు అపార నష్టం మిగిల్చాయి.

Update: 2024-09-19 16:29 GMT

మొన్న వయనాడ్.. నిన్న ఖమ్మం.. వరంగల్, విజయవాడ నగరాల్లో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. భారీ వర్షాలు, వరదలు అపార నష్టం మిగిల్చాయి. వివిధ దశల్లో ఉన్న పంటలు వరదల ధాటికి నష్టపోయాయి. వేల సంఖ్యలో ఇండ్లు నేలమట్టం అయ్యాయి. వందలమంది ప్రాణాలు పోయాయి. మూగ జీవాలూ బలయ్యాయి. ప్రాజెక్టులకు, చెరువులకు గండ్లు పడ్డాయి. రహదారులు కొట్టుకుపోయాయి. మరి ఇంతటి బీభత్సానికి గల కారణాలేంటి..? వాటిని అలర్ట్ చేయడంలో వాతావరణ శాఖ ఎందుకు విఫలం అవుతోంది..? కేంద్ర ప్రభుత్వం తెస్తున్న మిషన్ మౌసమ్‌తో మార్పులు వస్తాయి? ఒకసారి తెలుసుకుందాం. - శ్రీనివాస్ బొల్లబత్తిని

వరదల కట్టడిలో విఫలం

దేశవ్యాప్తంగా వర్షాలు, వరదల ప్రళయం వచ్చే అవకాశాలు ఉన్న సందర్భంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) ఆయా జిల్లాలను అలర్ట్ చేస్తుంటుంది. విపత్తు నిర్వహణకు సంబంధించిన విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. విపత్తుపై రాష్ట్రాలను అలర్ట్ చేయడం లక్ష్యంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మరియు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డిసెంబర్ 23, 2005న ఏర్పాటయ్యాయి. ఎలాంటి విపత్తునైనా తట్టుకునేందుకు ఈ రెండు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అనేది రాష్ట్ర-నియంత్రిత విపత్తు నిర్వహణ అథారిటీ. ఇది ఏదైనా విపత్తు సంభవించినప్పుడు బాధితులకు ఉపశమనం, సహాయం అందించడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఉంటుంది. ఇది రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీని కూడా ఏర్పరుస్తుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ రెస్క్యూ మిషన్‌లను ప్లాన్ చేయడానికి, ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను తరలించడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో సమన్వయం చేసుకుంటుంది. కానీ.. ఏటా నగరాలను విపత్తులు ముంచెత్తుతున్నా వాటిని గుర్తించడంలో.. అరికట్టడంలో డిజాస్టర్లు విఫలమైనట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వాతావరణం అంచనా ఎలా?

ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఎడారులు, మంచు కొండలు, మైదాన, పర్వతప్రాంతాలతోపాటు విశాలమైన భూభాగం వల్ల వాతావరణాన్ని అంచనా వేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ప్రపంచంలోనే అత్యంత కచ్చితత్వంతో వాతావరణాన్ని అంచనా వేయడంలో యూరప్ ముందున్నది. ఇక్కడ లాంగ్ రేంజ్, మీడియం, షార్ట్ రేంజ్ వెదర్ ప్రిడిక్షన్ చేస్తారు. లాంగ్ రేంజ్ 15 రోజునుంచి 30 రోజులు ఆపై వాతావరణాన్ని అంచనా వేస్తారు. దీనిలో కచ్చితత్వం చాలా తక్కువ. ఈశాన్య రాష్ట్రాలనుంచి రుతుపవనాలు మొదలై కేరళను తాకే తేదీలను అంచనా వేస్తారు. అప్పుడు మొదలైన రుతుపవనాల వేగం గమనాన్ని బట్టి వర్షసూచన అంచనా వేస్తారు. కానీ, మధ్యలోని వాతావరణ పరిస్థితులు మారితే రుతుపవనాల వేగం, తీవ్రత తగ్గి అంచనాలు తప్పుతాయి. ఇక మధ్య శ్రేణి వాతావరణ అంచనా 3రోజునుంచి నుంచి 10 రోజుల వరకు ఉంటాయి. యూరప్ లో ఈ తరహా వ్యవస్థ అత్యంత కచ్చితత్వంలో పనిచేస్తున్నది. ఇక స్వల్ప శ్రేణి వాతావరణ అంచనాలు ఒక గంట నుంచి ఒకరోజు వరకు మారే వాతావరణాన్ని అంచనా వేస్తుంది. ఇందులో ఏ రకమైన అంచనా అయినా, దీనివెనుక శాస్త్రీయత ముఖ్యం. ఇందుకు భారీగా శాటిలైట్ వ్యవస్థలు, కొన్ని ఏండ్ల వాతావరణ పరిస్థితులు క్షణాల్లో అంచనా వేసి అలర్ట్ చేసే సూపర్ కంప్యూటర్లు, డాప్లర్ రాడార్లు, విండ్ ప్రొఫైలర్లు, రేడియో మీటర్లు అవసరం అవుతాయి. యూరప్ లో పదేళ్లపాటు ప్రతి సెకన్ వాతావరణాన్ని రికార్డ్ చేసి ఆ డేటాను సూపర్ కంప్యూటర్లతో విశ్లేషించడం ఫలితంగానే ఇప్పుడు వారంలో ఏ రోజు ఎన్ని గంటలకు వర్షం ఎంతసేపు కురుస్తుందనే కచ్చితమైన అంచనాలు వేయగలుగుతున్నారు. మనదేశంలోనూ వెదర్ మ్యాన్ రిపోర్టులు శాస్త్రీయంగా ఉంటున్నాయని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.

మిషన్ మౌసమ్

ఇటీవలే నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వాతావరణాన్ని కచ్చితత్వంతో అంచనా వేయడానికి ‘మిషన్ మౌసమ్’ ప్రోగ్రామ్ చేపట్టింది. కేంద్రం ప్రకటించిన ‘మిషన్- 2047’లో భాగంగా ఈ పథకాన్ని చేపట్టింది. వచ్చే రెండేళ్ల కాలానికి ఈ మిషన్ కు రూ.2వేల కోట్లు కేటాయించింది. అంతరిక్షంలోకి నెక్ట్స్ జనరేషన్ శాటిలైట్లు పంపడంతోపాటు, అత్యాధునిక రాడార్లు, సెన్సార్లు ఏర్పాటు చేసి వాతావరణాన్ని కచ్చితత్వంతో అంచనా వేసే ప్రణాళికలకు శ్రీకారం చుట్టనున్నది. శాటిలైట్లు, రాడార్లతో అందిన భౌగోళిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత శాఖలకు హెచ్చరికలు పంపే రియల్ టైమ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ మిషన్ ను భారతీయ వాతావరణ శాఖ, భారత ఉష్ణమండల వాతావరణ పరిశోధన సంస్థ, జాతీయ మధ్య, స్వల్ప శ్రేణి వాతావరణ అంచనా కేంద్రం ఈ మూడు కీలక విభాగాలు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేయనున్నాయి.

మౌసమ్.. లాభాలు

కేంద్రప్రభుత్వం చేపట్టిన మిషన్ మౌసమ్ వల్ల వాతావరణ అంచనా వ్యవస్థలు బలోపేతం అవుతాయి. వ్యవసాయం నష్టాలను తప్పించే అవకాశం ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్, రక్షణ శాఖ, విద్యుత్, జల శాఖలను అలర్ట్ చేయవచ్చు. వాతావరణాన్ని కచ్చితత్వంతో అంచనా వేయడం విమానాల రాకపోకలకు సులభం అవుతుంది. పర్యాటకరంగానికి ఊతమిస్తుంది.

చేదు జ్ఞాపకం దివి సీమ ఉప్పెన

చరిత్రలో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు గుళికలు కూడా ఉంటాయి. అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమ ఉప్పెన విషాదం. యావత్ భారత్ దేశాన్ని కదిలించిన దివి సీమ ఉప్పెన విషాదానికి 47 ఏళ్లు పైనే అవుతోంది. 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుపానుతో వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. ఈ ప్రకృతి విలయానికి అధికారికంగానే 14వేలకు పైగా ప్రజలు మరణించారు. అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గుట్టలుగా శవాలు పేరుకుపోయాయి. లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. అప్పట్లోనే సుమారు రూ.172 కోట్ల నష్టం సంభవించింది.

వారిది.. వీరిది ఒకటే వ్యథ

విజయవాడలోని బుడమేరు, తెలంగాణలోని మున్నేరు వాగు పరిస్థితి ఈ సారి అటు విజయవాడ ప్రజలను ఇక్కడ ఖమ్మం జిల్లాను ప్రజలకు విషాదం మిగిల్చాయి. మున్నేరు వాగుకు ఖానాపురం, లకారం వంటి చెరువులతోపాటు దానికి అనుసంధానంగా ఉన్న కాల్వల పరిధిలో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు ఉన్నాయి. ఈ పరిధిలో ఎలాంటి భూ అమ్మకాలు, కొనుగోలు జరగకూడదు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతి కూడా ఇవ్వరాదు. కానీ, సాధారణ భూములకు మాదిరే అన్ని రకాల అనుమతులిచ్చారు. అడ్డుకోవాల్సిన అధికారులు భూముల రిజిస్ట్రేషన్ల నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు అన్ని ప్రక్రియలను యథేచ్ఛగా పూర్తి చేసి ప్రజలను వరదల్లోకి నెట్టేశారు. అంతేగాక కబ్జాలకు తెగబడిన కొంతమంది అక్రమార్కులు నది ప్రవాహానికి అడ్డు నిలిచారు. ఫలితమే ఓ మహా విపత్తు గుప్పిట నిలవడం. అలాగే.. ఖమ్మం పరిధిలోని మున్నేరు వాగు చుట్టుపక్కల కూడా ఎలాంటి నిర్మాణాలు చేయరాదు. కానీ.. ఇష్టారాజ్యంగాభారీ ఎత్తున కట్టడాలు వెలిశాయి. కొన్ని అక్రమ పర్మిషన్లతో నిర్మాణం జరిగితే.. మరికొన్ని అనుమతులు లేకుండానే వెలిశాయి. దాంతో ఈ ప్రకృతి వినాశనం చూడాల్సి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అధికారులే బాధ్యులు..

వరదల వల్ల విజయవాడ, ఖమ్మం ప్రజలు నష్టపోవడంలో అధికారుల పాత్ర కీలకంగా కనిపిస్తోంది. బాధ్యత గల అధికారులు ఆక్రమణలను అడ్డుకోవడం, నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడం వంటి చర్యలు తీసుకోవాల్సింది పోయి తమకు పట్టనట్లుగా వ్యవహరించారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా భవిష్యత్‌ గురించి వారు ఎలంటి ఆలోచన చేయలేదు. జనాభా పెరుగుతున్నది.. దానికి అనుగుణంగా ఇళ్ల స్థలాలు అవసరమవుతున్నాయి కాబట్టి భూ దందాకు దిగుతున్న కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకే ఇళ్లు, స్థలాల అమ్మకాలు చేయడం మెుదలు పెడుతున్నారు. దీనికి పేద, మధ్య తరగతి ప్రజలు ఆకర్షితలవుతున్నారు. ఎప్పుడో వచ్చే వరదల గురించి ఇప్పుడెందుకు భయమంటూ వారికి ధైర్యాన్నిస్తూ వారి ఆశలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. చివరకు ఆ వరదలకే ప్రజలను సమిధలుగా చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌, తర్వాత బెంగళూరు, పోయిన ఏడాది చెన్నై ఇప్పుడు విజయవాడ, ఖమ్మం. ప్రాంతమేదైనా వరదలకు నగరాలు నీట మునగడం సర్వసాధారణంగా మారింది.

చెరువులు మాయం

హెచ్ఎండీఏ విస్తరించి ఉన్న ఏడు జిల్లాల పరిధిలో 3,532 చెరువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 3వేల చెరువులకు ఫుల్ ట్యాంక్ లెవల్‌ను నిర్ధారించారు. కానీ.. చాలా చోట్ల ఎఫ్‌టీఎల్ పూర్తిగా ఆక్రమణలకు గురైంది. కొంత మంది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటి పరిధిలో విల్లాలు, అక్రమ కట్టడాలు నిర్మించారు. ప్రస్తుతం వాటి సంగతి హైడ్రా చూస్తోందనుకోండి. కానీ.. ఈ చెరువులు మాయం చేయడం వల్ల కూడా హైదరాబాద్ నగరాన్ని చాలా సార్లు వరదలు ముంచెత్తాయి. అటు.. జిల్లాల్లోనూ వేలాది చెరువులు కబ్జాకు గురయ్యాయి. దాంతో ఇప్పుడు హైడ్రా డిమాండ్ జిల్లాల నుంచి కూడా వినిపిస్తోంది.

వరదలను స్టోర్ చేసే కెపాసిటీ లేక..

మరోవైపు.. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వరదలను స్టోర్ చేసేందుకు దానికి అనుగుణంగా వనరులు లేవు. ఎప్పుడో పాతకాలం నాటి ప్రాజెక్టులు.. తక్కువ టీఎంసీలతో నిర్మించిన ప్రాజెక్టులు.. నాలుగు పెద్ద వానలు పడితే చాలు నిండిపోతున్నాయి. దాని ద్వారా పెద్ద వర్షాలు పడిన వారం రోజులకే గేట్లు తెరుచుకుంటున్నాయి. వాటి ద్వారా లక్షలాది టీఎంసీల నీరు వరద పాలవుతోంది. అదే వరదను స్టోర్ చేసే పరిస్థితి ఉంటే నగరాలకు ఇంత పెద్ద ప్రమాదాలు పొంచి ఉండకపోవచ్చనేది పలువురి అభిప్రాయం.

రికార్డు స్థాయిలో వచ్చిన వరదలు

2005 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏపీలో వరదలొచ్చాయి. కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగడంతో వచ్చిన వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా పది జిల్లాలపై వరద ప్రభావం పడింది. 2005లో బుడమేరుకు కూడా వరదలొచ్చాయి. వర్షకాలంలో 11 వేల క్యూసెక్కుల వరద ప్రవహించే బుడమేరులో.. 2005లో ఏకంగా 70 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది.

- 2006లో గోదావరి, శబరి నదులకు వరదలు రావడంతో.. మూడు జిల్లాలపై ప్రభావం పడింది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 70 అడుగులకు చేరింది.

- 2007లో అల్పపీడనాల కారణంగా జూన్, అక్టోబర్ నెలల్లో వరదలొచ్చాయి. ఈ వరదలు 6 జిల్లాలపై ప్రభావం చూపాయి.

- 2008 ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లోనూ ఏపీలో భారీ వర్షాలు కురిసి వరదలొచ్చాయి.

- 2009లో అక్టోబర్ నెలలో భారీ వర్షాలు కురవడంతో తుంగభద్ర వరద కర్నూలు నగరాన్ని ముంచెత్తింది. మంత్రాలయం కూడా వరద బారిన పడింది.

- 2010 సెప్టెంబర్, నవంబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాల వల్ల 3 జిల్లాల్లో వరద పరిస్థితులు సంభవించాయి.

- 2012 నవంబర్‌లో వచ్చిన నీలం తుఫాను 6 జిల్లాల్లో వరదలకు కారణమైంది.

- 2013 అక్టోబర్లో వచ్చిన వరదలు వల్ల 5 జిల్లాలు ప్రభావితమయ్యాయి.

- 2015 నవంబర్లో వచ్చిన వరదలు 5 జిల్లాలను ప్రభావితం చేశాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వరదల్లో 35 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

- 2018 డిసెంబర్‌లో ఏర్పడిన పెథాయ్ తుఫాను 4 జిల్లాలను ప్రభావితం చేసింది.

- 2019 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు.. గోదావరి, కృష్ణా నదులకు పోటెత్తిన వరదలతో 4 జిల్లాలు ప్రభావితం అయ్యాయి.

- 2020లో సైక్లోన్ నివార్ కారణంగా వచ్చిన వరదలు పలు జిల్లాలను ప్రభావితం చేశాయి.

- 2022లో గోదావరికి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. దీంతో కోనసీమలోని లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఆరు జిల్లాలపై వరదలు ప్రభావం చూపాయి. భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగుల స్థాయి దాటి ప్రవహించింది.

- 2024 ఆగస్టు చివర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు వరదలొచ్చాయి. బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడ ముంపు బారిన పడింది. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దింపాల్సి వచ్చింది.

- గోదావరికి 1954, 1986, 1990, 2006, 2013, 2020లలో వచ్చిన వరదలే పెద్దవిగా నమోదయ్యాయి. ఆ వరదలన్నీ ఆగస్టు నెలలోనే వచ్చాయి. ఎక్కువగా ఆగష్టు మొదటి, రెండు వారాల్లోనే భారీ వరదలు వస్తుండడం సహజంగా కనిపించింది. అలాగే.. 2022 ఆగస్టులోనూ ఇలాంటి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఆ సమయంలో భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరు జిల్లాల్లోని వందల గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పోలవరం ముంపు మండలాలతోపాటు గోదావరి లంకలు, కోనసీమ గ్రామాల ప్రజలు భయాందోళనతో గడపాల్సి వచ్చింది.

- 2024 ఆగస్టులోనే ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఏకంగా 45 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది. దాంతో ఆ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

క్లౌడ్ బరస్ట్‌లో వాస్తవమెంత..?

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ, ఖమ్మం జిల్లాలో ఈ సారి నష్టాన్ని చవిచూశాయి. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇండ్లు నేలమట్టం అయ్యాయి. ఇంకా ఇళ్లన్నీ బురదలోనే ఉండిపోయాయి. వారం గడుస్తున్నప్పటికీ ఇంకా ప్రజలు భారీ వరదల నుంచి తేరుకోలేకపోతున్నారు. అయితే.. ఈ వర్షాలపై అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో విపత్తులను చూశాం కానీ.. ఇంతటి వరదల విలయాన్ని చూడలేదని అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ ఒక్క గుజరాత్‌లోనే వరద విలయం కనిపిస్తూ ఉంటుంది. కానీ.. ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఆ పరిస్థితి చూశాం. ఇంతటి భారీ వర్షాలకు గల కారణాలనూ ఆయన వెతికే పనిలో పడినట్లుగా సమాచారం. ఎల్‌నినో ప్రభావం వల్ల గతేడాది పెద్దగా వర్షాలు పడలేదు. ఈసారి మాత్రం రుతుపవనాలు రివర్స్ అటాక్ చేశాయి. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. అయితే.. ఈ వర్షం దేశవ్యాప్తంగా పడితే అంతగా చర్చకు దారితీసే అవకాశం ఉండేది కాదు. కానీ.. ఒకటి రెండు చోట్ల మాత్రమే కురియడం ఆందోళన కలిగించే అంశం. ఆకాశానికి రంధ్రం పడిందా అన్నట్లుగా ఒకేచోట కుండపోత కురిసింది. అటు గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ క్లౌడ్ బరస్ట్‌లు కనిపించాయి. మరోవైపు.. కేరళలోని వయనాడ్‌లోనూ క్లౌడ్ బరస్ట్ ఏ స్థాయిలో ప్రభావం చూపిందో చూశాం.

ఎడారి దేశంలోనూ వానలు

ఎడారి దేశం అయిన దుబాయిలో వర్షం అంటే తెలియదు. వర్షం కురియని దేశం ఏదైనా ఉందా అంటే అది దుబాయిని ఇన్నాళ్లు పాఠాల్లో చదువుకున్నాం. కానీ..ఇటీవల దుబాయిలోనూ వర్షాలు దంచికొట్టాయి. వరదలు అతలాకుతలం చేశాయి. నీళ్లలో వాహనాలు, గాలులకు నేలకూలిన చెట్లు, వరద బీభత్సాన్ని సృష్టించాయి. ప్రపంచంలోనే ప్రయాణికుల పరంగా రెండో అత్యంత రద్దీ విమానాశ్రయమైన దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ను సైతం భారీ వరద ముంచెత్తింది. వందలాది విమానాలు రద్దు అయ్యాయి. దక్షిణ దుబాయ్‌కు 150 కి.మీ దూరంలో ఉన్న ఖాతమ్ అల్ షిక్లా ఏరియాలో 24 గంటల్లో 254.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంగా యూఏఈ అంతటా ఒక ఏడాదిలో కురిసే వర్షపాతానికి ఇది సమానం. గత 75 ఏళ్లలో ఇదే గరిష్ట వర్షపాతమని నేషనల్ మెటలర్జికల్ సెంటర్ ఆఫ్ యూఏఈ చెప్పింది. దేశ చరిత్రలో ఇదొక అసాధారణ ఘటన అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. యూఏఈలో స్వల్ప సమయంలోనే మునుపెన్నడూ లేని విధంగా ఇంత వాన కురిసింది.


Similar News