కర్ణాటక ఎన్నికల వేళ తెరమీదకు సరికొత్త వివాదం
కర్ణాటకలో ఎన్నికల వేళ సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్ ఏంట్రీ వ్యవహారంపై దుమారం రేగుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో ఎన్నికల వేళ సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్ ఏంట్రీ వ్యవహారంపై దుమారం రేగుతోంది. స్థానిక పాడి రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న 'నందిని మిల్క్'కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. నందిని మిల్క్‌నే వాడాలని బెంగళూరులోని హోటల్స్ తాజాగా నిర్ణయించాయి. అయితే, లాంచ్అలర్ట్అన్న హ్యాష్‌ట్యాగ్‌తో కర్ణాటకలో ఎంట్రీ ఇస్తున్నట్టు అమూల్సంస్థ ఇటీవలే ట్వీట్ చేసింది.
పాలు, పెరుగు డెలివరీ కోసం ఓ ఈ కామర్స్ వేదికను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంపై కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడు బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘కన్నడిగులు నందిని పాల ఉత్పత్తులనే వినియోగించాలి. మా రైతులు తయారు చేస్తున్న నందిని మిల్క్ చూసి మాకు గర్వంగా ఉంది. నందిని మిల్క్‌నే అందరు ప్రోత్సహించాలి. మా నగరంలో కాఫీకి చాలా విశిష్టత ఉంది. మేము వినియోగించే పాలు అలాంటివి మరి. బయట రాష్ట్రాల నుంచి పాలు కర్ణాటకలోకి వస్తున్నట్టు తెలుస్తోంది.
మేము వాటిని వ్యతిరేకిస్తున్నాము. నందినికే మా మద్దతు’ అని అమూల్ డైరీ పేరు ఎత్తకుండా ఓ ప్రకటన జారీ చేసింది. నందిని పాలనే వినియోగిస్తామని స్పష్టం చేసింది. కాగా, అమూల్ ఎంట్రీ పై రాజకీయ రగడ మొదలైంది. రాష్ట్రంలో బలమైన డెయిరీ బ్రాండ్ అయిన నందిని మిల్క్ బ్రాండ్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. అమూల్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని కన్నడిగులు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. కర్ణాటక మిల్స్ ఫెడరేషన్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ మధ్య విలీనానికి సంబంధించి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.