హృదయ విధారక ఘటన.. కుమార్తెను పరీక్షకు అనుతించకపోవడంతో సొమ్మసిల్లిన తల్లి
కుమార్తెను పరీక్షకు అనుమంతించకపోవడంతో తల్లి ఎగ్జామ్ సెంటర్ వద్దే సొమ్మసిల్లి పడిపోయిన హృదయ విదారక ఘటన గురుగ్రాంలో జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కుమార్తెను పరీక్షకు అనుమంతించకపోవడంతో తల్లి ఎగ్జామ్ సెంటర్ వద్దే సొమ్మసిల్లి పడిపోయిన హృదయ విదారక ఘటన గురుగ్రాంలో జరిగింది. దీనికి సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆదివారం దేశవ్యాప్తంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే గురుగ్రాం పట్టణంలోని ఎస్‌డీ ఆదర్శ విద్యాలయంలో ఓ మహిళ అభ్యర్ధి ఎగ్జామ్ రాసేందుకు తన తల్లిదండ్రులతో పాటు పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయానికి గేట్ క్లోజ్ చేశారు. ఆలస్యం అయ్యిందని స్కూల్ ప్రిన్సిపాల్ లోపలికి అభ్యర్ధిని అనుమతించలేదు. అనుమతించాలని ఎంత బ్రతిలాడినా పట్టించుకోకుండా గేట్లు మూసివేశారు.
చాలా కాలం నుంచి కష్టపడుతుందని, దయచేసి లోపలికి పంపించాలని ప్రిన్సిపాల్ ను వేడుకున్న అనుమతించలేదు. అనుమతించాలని చాలా సేపు గేటు వద్దే రోదిస్తూ సిబ్బందిని వేడుకున్నారు. దీంతో మనోవేదనకు గురైన తల్లి రోదిస్తూ.. పరీక్ష కేంద్రం గేటు వద్దే సొమ్మసిల్లి పడిపోయింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ హృదయవిదారక ఘటన చూసిన నెటిజన్లు ఆ తల్లిదండ్రులు పట్ల జాలి చూపిస్తున్నారు. రూల్స్ పాటించడంలో స్కూల్ ప్రిన్సిపాల్ తప్పేం లేదని, ఆ తల్లిదండ్రులు ఇంకొంత జాగ్రత్త వహించి ఉండాల్సింది అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.