Chhattisgarh: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.

Update: 2024-08-29 11:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. కాగా... భద్రతాబలగాలు, మావోల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. బస్టర్ జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) సంయుక్త బృందం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మద్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. మావోలు నక్కి ఉన్నారనే సమాచారంతో ఆపరేషన్ ప్రారంభించామన్నారు. నారాయణపూర్ ఎస్పీ మాట్లాడుతూ.. “సెర్చ్ ఆపరేషన్ సమయంలో, మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు మహిళా మావోయిస్టుల డెడ్ బాడీలను గుర్తించాం. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది ”అని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ పోలీసు రికార్డుల ప్రకారం, బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది కనీసం 34 మంది పౌరులు మావోయిస్టుల చేతిలో మరణించగా.. ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాద (LWE) వ్యతిరేక కార్యకలాపాలలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో 145 మంది మావోయిస్టులు మరణించారు.

అమిత్ షా ఏమన్నారంటే?

2026 మార్చినాటికి మావోల హింస నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ నెల 25న ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సల్‌ ఆపరేషన్స్‌పై జరిగిన సమావేశం అనంతరం మాట్లాడుతూ.. వామపక్ష తీవ్రవాదంపై అంతిమ దాడి చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు అతి పెద్ద సవాల్‌ మావోయిస్టులే అని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సవాల్‌ను స్వీకరించిందని.. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తేవడానికి ప్రయత్నించిందని చెప్పారు.


Similar News