అసోంలో 25 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్..శంకుస్థాపన చేసిన సీఎం
అసోంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించే దిశగా ముందడుగు పడింది. దిబ్రూగఢ్ జిల్లాలోని నామ్‌రూప్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 25 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు సీఎం బిస్వ శర్మ శంకుస్థాపన చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించే దిశగా ముందడుగు పడింది. దిబ్రూగఢ్ జిల్లాలోని నామ్‌రూప్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 25 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు సీఎం బిస్వ శర్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2021లో సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు..రాష్ట్రంలో పీక్-అవర్ విద్యుత్ డిమాండ్ 1,800 మెగావాట్లు మాత్రమే ఉంది. కానీ పారిశ్రామిక వృద్ధి, రాష్ట్రవ్యాప్తంగా గతంలో విద్యుత్ లేని గ్రామాల విద్యుదీకరణ కారణంగా ఈ డిమాండ్ 2,500 మెగావాట్లకు పెరిగింది’ అని చెప్పారు.
‘రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 419 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కానీ ప్రతిరోజూ దాదాపు 2,100 మెగావాట్ల కొనుగోలు అవసరం. సోలార్ పవర్ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. రాష్ట్రం వెలుపల నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌పై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తాయి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ప్రాజెక్ట్ అసోం పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ జాయింట్ వెంచర్. 108 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు 2022 ఆగస్టు19న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది ఏటా 50 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని, దీని నిర్మాణం జూలై 2025 నాటికి పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.