Kedarnath Yatra: కేదర్‌నాథ్‌లో ఘోర ప్రమాదం.. విరిగిపడిన కొండచరియలు..

కేదర్‌నాథ్ యాత్రికులకు మరో భారీ ప్రమాదం ముంచుకొచ్చింది.

Update: 2023-08-04 14:40 GMT

ఉత్తరాఖండ్: కేదర్‌నాథ్ యాత్రికులకు మరో భారీ ప్రమాదం ముంచుకొచ్చింది. ఉత్తరాఖండ్‌లోని కేదర్‌నాథ్ మార్గంలో గురువారం రాత్రి భారీ కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో స్థానిక దుకాణాలు, హోటళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద 19 మంది యాత్రికులు భూస్థాపితమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు వెలికి తీశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర భారతంలో నాలుగు వారాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో వంతెనలు, ఇళ్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగి పడి పలువురు మరణిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 199 మంది చనిపోయారు. గురువారం రాత్రి ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం కురవడంతో రుద్రప్రయాగ్ జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. కేదర్‌నాథ్‌కు వెళ్తున్న 19 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకున్న జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి గల్లంతు..

గౌరీకుండ్ పోస్ట్ బ్రిడ్జ్ సమీపంలో దూసుకెళ్లిన బండరాళ్లు పడి దుకాణాలు, హోటళ్లు ధ్వంసమయ్యాయి. వాటి శిథిలాలు దిగువన ఉన్న నదిలో పడిపోయాయి. బాధితులు కూడా నదిలో కొట్టుకుపోయి ఉంటారని లేదా శిథిలాల కింద నలిగిపోయి ఉంటారని తెలుస్తోంది. గల్లంతైన వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. నిద్రపోతున్న వీరిపై కొండచరియలు విరిగిపడ్డాయి. గౌరీకుండ్ అనేది పార్వతీదేవి ఆలయం ఉండే యాత్రాస్థలం. కేదర్‌నాథ్ ఆలయానికి ట్రెక్కింగ్ కూడా ఇక్కడి నుంచే చేస్తారు. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రకృతి విపత్తులు ఏదో ఒక రూపంలో ఆటంకం కలిగిస్తున్నాయి. వర్షాలు ప్రారంభం కావడంతో యాత్రికుల సంఖ్య కూడా తగ్గింది.


Similar News