సరెండర్ అయిపోండన్న ‘సుప్రీం’.. గడువు కావాలంటున్న బిల్కిస్ బానో కేసు దోషులు
దిశ, నేషనల్ బ్యూరో : బిల్కిస్‌బానో కేసులో రెండేళ్ల క్రితం గుజరాత్ సర్కారు నుంచి క్షమాభిక్ష పొందిన 11 మంది దోషులు రెండువారాల్లోగా సరెండర్ కావాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది.
దిశ, నేషనల్ బ్యూరో : బిల్కిస్‌బానో కేసులో రెండేళ్ల క్రితం గుజరాత్ సర్కారు నుంచి క్షమాభిక్ష పొందిన 11 మంది దోషులు రెండువారాల్లోగా సరెండర్ కావాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆర్డర్స్‌పై న్యాయస్థానం వేదికగా దోషులు స్పందించారు. తమకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని, లొంగిపోయేందుకు టైం ఇవ్వాలంటూ ముగ్గురు దోషులు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలకు తన అవసరం ఉందని దోషుల్లో ఒకడైన గోవింద్ నాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ‘‘నేను ఆస్తమాతో బాధపడుతున్నాను. ఇటీవలే నాకు శస్త్రచికిత్స కూడా జరిగింది’’ అని కోర్టుకు తెలిపాడు. ఈ పిటిషన్ వేసిన మిగతా ఇద్దరు దోషుల పేర్లు ప్రదీప్ రామన్ లాల్ మోడియా, విపిన్ చంద్ర జోషి అని తెలిసింది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగాయి. అదే టైంలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులోని 11 మంది దోషులు 15ఏళ్లుగా కారాగారంలో గడిపారు. 2022లో వీరికి గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేయడం వివాదానికి దారితీసింది. కాగా, ఆ దోషుల్లో కొందరు అదృశ్యమైనట్లు కొద్దిరోజుల క్రితం పత్రికల్లో కథనాలు వచ్చాయి.