అజిత్ పవార్ శిబిరంలో కలవరం.. శరద్ పవార్‌తో టచ్‌లో 10-15 మంది ఎమ్మెల్యేలు

పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఎన్సీపీ (శరద్‌ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ చెప్పారు.

Update: 2024-06-06 12:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అనేక రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టించాయి. అందులోనూ ఈ ఫలితాల కారణంగా మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం పాలు కావడంతో కూటమి పార్టీల పరిస్థితి సవాలుగా మారింది. మొత్తం 48 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, ఎన్సీపీ, శివసేన పార్టీలు 17 స్థానాలను మాత్రమే గెలుచుకున్నాయి. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి పార్టీలు కాంగ్రెస్‌, శరద్‌ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్‌ శివసేన 30 స్థానాలను సాధించాయి. దీంతో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అయోమయంలో పడింది. తాజాగా అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్‌లో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాన్ని అజిత్ పవార్ వర్గం కొట్టిపారేస్తోంది. అవన్నీ ఫేక్ వార్తలని, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం ఒకే ఒక ఎంపీ సీటును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే ఉండటంతో రాష్ట్రంలోని రాజకీయాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఎన్సీపీ (శరద్‌ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పార్టీ పేరు ప్రస్తావించకుండా చెప్పారు. జూన్ 9న జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనల గురించి ఆలోచిస్తామని.. జూన్ 10న మా వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటామని ఆయన చెప్పారు. మరోవైపు మహారాష్ట్రలో రాజకీయ గందరగోళం మధ్య, అసంతృప్త నేతలను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే త్వరలో మంత్రివర్గ విస్తరణకు వెళ్లవచ్చని తెలుస్తోంది. 


Similar News