80శాతం అనధికారిక లేఅవుట్లు అక్కడే

ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్​ఇవ్వడంతో సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడనున్నాయి. ఈనెల నాల్గవ తేదీ నుంచి మరిన్ని క్రయవిక్రయాలు పుంజుకునే అవకాశం ఉన్నట్లు సబ్ రిజిస్ట్రార్లు అంచనా వేస్తున్నారు. అయితే ఎల్ఆర్ఎస్ లేకపోయినా రిజిస్ట్రేషన్లకు వీలుండే ప్రాంతాలు సెమీ అర్బన్‌లోనే అధికం. ప్రధానంగా జీహెచ్ఎంసీ కంటే దాని చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లోనూ అనుమతి లేని లేఅవుట్లు ఉన్నాయి. మొత్తం లేఅవుట్లల్లో 80 శాతం […]

Update: 2021-01-02 00:17 GMT

ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్​ఇవ్వడంతో సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడనున్నాయి. ఈనెల నాల్గవ తేదీ నుంచి మరిన్ని క్రయవిక్రయాలు పుంజుకునే అవకాశం ఉన్నట్లు సబ్ రిజిస్ట్రార్లు అంచనా వేస్తున్నారు. అయితే ఎల్ఆర్ఎస్ లేకపోయినా రిజిస్ట్రేషన్లకు వీలుండే ప్రాంతాలు సెమీ అర్బన్‌లోనే అధికం. ప్రధానంగా జీహెచ్ఎంసీ కంటే దాని చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లోనూ అనుమతి లేని లేఅవుట్లు ఉన్నాయి. మొత్తం లేఅవుట్లల్లో 80 శాతం వరకు అనధికారికమేనని సబ్​రిజిస్ట్రార్లు కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక సెమీ అర్బన్‌లో ఫుల్ రిజిస్ట్రేషన్లు జరుగనున్నట్లు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నుంచి విముక్తి కల్పిస్తుందని ఎవరూ ఊహించలేదు. వేలాది ప్లాట్ల విక్రయానికి అగ్రిమెంట్లు జరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు డబ్బులు సర్దుబాటు చేయలేరు. అందుకే సోమవారం నుంచి పుంజుకుంటాయని అంచనా. ఇప్పుడు గ్రేటర్​ హైదరాబాద్‌లో కంటే సెమీ అర్బన్, రూరల్​ ఏరియాస్‌లోనే రిజిస్ట్రేషన్ల నుంచి అధికంగా ఆదాయం లభించనుంది. అయితే ఈ నాలుగు నెలల నష్టాన్ని పూడ్చుకునే స్థాయిలో రెవెన్యూ వచ్చే అవకాశమైతే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రియల్​ ఎస్టేట్ ​వ్యాపారం నిరంతరం జరగాలి. అప్పుడే ఏజెంట్లు కొనుగోలు చేయడం, తిరిగి అమ్మడం లేదా అగ్రిమెంట్ల మీదనే మరొకరికి విక్రయించడం లాంటివి జరుగుతుండేవి. ఈ బంద్​కాలంలో అలాంటి లావాదేవీలు పునరుద్ధరించలేరు. ప్రధానంగా ఎల్బీనగర్, హయత్‌నగర్​, ఇబ్రహింపట్నం, షాద్‌నగర్, శంకర్‌పల్లి, మేడ్చల్, శామీర్‌పేట, ఘట్‌కేసర్, వికారాబాద్‌లతో పాటు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోని ప్లాట్ల క్రయవిక్రయాలు ఊపందుకోనున్నాయి.

స్కీంలో మరింత వెసులుబాటు

ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​స్కీంలో మరింత వెసులుబాటు కల్పించింది. తొలుత క్రయవిక్రయాలకు అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటికే రూ.1000 వంతున చెల్లిస్తూ దాఖలైన 25.59 లక్షల దరఖాస్తుదారులు ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు సదరు ఫీజు చెల్లిస్తే చాలునని ప్రకటించింది. అప్లయ్ చేసినప్పుడు మున్సిపల్/గ్రామ/కార్పొరేషన్ అధికారులు పరిశీలించిన స్థల విస్తీర్ణాన్ని బట్టి ఫీజులను నిర్దేశించారు. ఆ మొత్తాన్ని ఇంటి నిర్మాణానికి అయ్యే సొమ్ముతో పాటే చెల్లించాల్సి ఉంటుంది. ఇంకనూ దరఖాస్తు చేసుకోని వారికి అదనపు వడ్డన తప్పదని ఉత్తర్వులో పేర్కొంది.

వెంచర్లకు భారం

ప్రస్తుతం కనీసం ఒక్కసారైనా సేల్​డీడ్​అయిన ప్లాట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్​నుంచి విముక్తి లభించింది. అదే ఏదైనా వెంచర్‌లో 100 ప్లాట్లు ఉండి సగం ప్లాట్లు అమ్మేస్తే, మిగతా సగం అమ్ముకోవడానికి యజమానికి హక్కులు లేవు. ఆ మిగతా 50 ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేస్తేనే క్రయవిక్రయాలు షురూ అవుతాయి. అక్రమంగా వెంచర్‌ను రూపొందించినందుకు ఈ భారాన్ని మోయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి గ్రామీణ ప్రాంతంలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా, మండల కేంద్రాల శివార్లలో సగం కూడా అమ్మని వెంచర్లు అధికంగా ఉన్నట్లు సబ్​రిజిస్ట్రార్లు చెబుతున్నారు. వారి పరిస్థితి ఇక అగమ్యగోచరమే. ఇప్పటికిప్పుడు వాళ్లు ఎల్ఆర్ఎస్​ ఫీజు కడదామని అనుకున్నా సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలిస్తే గానీ ముందడుగు పడే అవకాశం లేదు.

టీఎస్ బీపాస్ రద్దు చేయాలి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ బిపాస్‌ను వెంటనే రద్దు చేయాలని బిల్డర్స్ అండ్ ప్లానర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు టీఎస్ బీపాస్ అమలు ద్వారా కూడా అదే ఫలితాన్ని చూడాల్సి వస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఎల్ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు ఉద్యమించిన తరహాలోనే టీఎస్ బీపాస్‌కు వ్యతిరేకంగా తాము కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల పొట్టను కొట్టి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News