లాక్‌డౌన్ పై మోడీ ఏం ఆలోచిస్తున్నారు?

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌పై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండు విడతలుగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా అమలైంది. ప్రస్తుతం కొన్ని సడలింపులతో మూడవ విడత లాక్‌డౌన్ అమలవుతోంది. లాక్‌డౌన్ నుంచి బైటపడే మార్గాల గురించి కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తూ ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడడానికి లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించడమా? లేక ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజల […]

Update: 2020-05-10 06:34 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌పై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండు విడతలుగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా అమలైంది. ప్రస్తుతం కొన్ని సడలింపులతో మూడవ విడత లాక్‌డౌన్ అమలవుతోంది. లాక్‌డౌన్ నుంచి బైటపడే మార్గాల గురించి కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తూ ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడడానికి లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించడమా? లేక ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధి యధాతథంగా కొనసాగేలా చర్యలు తీసుకోవడమా? ఇప్పుడిదే కేంద్ర ప్రభుత్వాన్ని తొలుస్తున్న ప్రశ్న. మూడవ విడత లాక్‌డౌన్‌లో భాగంగా ఆంక్షలు సడలిస్తుండడంతోనే లాక్‌డౌన్ ఇంకెంతో కాలం కొనసాగే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇక ఇప్పుడు చేయాల్సింది ‘డ్యామేజ్ కంట్రోల్’ అనే ప్రక్రియే. ఆర్థిక వ్యవస్థను పట్టాలపైకి ఎక్కించడం ద్వారా మాత్రమే పరిశ్రమలు, వివిధ రంగాలు యధాతథ స్థితికి వచ్చి కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి గ్యారంటీ లభిస్తుందన్నది ప్రభుత్వ భావన. దీనికోసం కొన్ని కార్మిక సంస్కరణలను తీసుకురావాలన్న కసరత్తు కూడా జరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కార్మిక చట్టాలకు సంస్కరణలు చేస్తూ ఆర్డినెన్సులు తీసుకొచ్చాయి.

లాక్‌డౌన్ అనంతరం ఏం చేయాలి?

లాక్‌డౌన్ అనే పద్మవ్యూహంలోంచి ఇప్పుడు బైటపడడం కోసం ఉన్న మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ నెల 17 తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేయడమా లేక మరికొన్ని ఆంక్షలను సడలించి క్రమంగా బైటపడడమా అనేదానిపై మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల వివిధ శాఖల మంత్రులతో చర్చలు జరిపారు. లాక్‌డౌన్ ముగింపుకు వస్తున్నందున నేడు మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇదే సమయంలో దేశంలోని తాజా కరోనా వైరస్ కేసులు, సాంద్రత, ప్రధాన నగరాల్లోని పరిస్థితి తదితరాలపై వరుస సమీక్షలు చేస్తున్నారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సైతం పది మంది మంత్రులతో భేటీ అయ్యారు. లాక్‌డౌన్ ఎత్తవేత అనంతరం తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ తదితరాలపై చర్చించారు. ఏయే రంగాలను ఏ తీరులో గాడిలో పెట్టాలో ప్రాధాన్యతా క్రమంపైన కూడా చర్చ జరుగుతోంది.

ఇప్పటికే విద్య, విద్యుత్, వ్యవసాయం, పౌర విమానయానం, ఆర్థికం, వాణిజ్యం తదితర మంత్రిత్వశాఖలు కసరత్తు చేస్తూ ఉన్నా లాక్‌డౌన్ తర్వాత నిర్వహించాల్సిన పరీక్షలు, ప్రవేశాలు, అకడమిక్ క్యాలెండర్ తదితరాలపై హెచ్చార్డీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఇక విద్యుత్ మంత్రిత్వశాఖ సైతం కొత్త బిల్లు కోసం, అందులో జొప్పించాల్సిన సంస్కరణలపై స్పష్టతకు వచ్చింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ సైతం నష్టాల్లో కూరుకుపోయిన ఈ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడంపై దృష్టి సారించింది. వరుసగా మూడు నెలలు పన్నులు వాయిదా పడడం, జీఎస్టీ లాంటివి దాదాపుగా జీరో స్థాయిలోకి పోవడంతో మళ్ళీ వాటిని దారిలోకి తేవడానికి ఆర్థికశాఖ ప్రణాళికలు రచిస్తూ ఉంది. ఇక విదేశాలతో వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతులు, వాటిపై విధించే సుంకంలో మార్పులు చేయడం.. లాంటివన్నీ అందులో భాగమే. కరోనా, లాక్‌డౌన్ పేరుతో ఇప్పుడు అనేక రకాల సంస్కరణలు తెరమీదకు రాబోతున్నాయి. అన్ని మంత్రిత్వశాఖల తక్షణ యాక్షన్ ప్లాన్‌పైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

డ్యామేజ్ కంట్రోల్ షురూ..

లాక్‌డౌన్‌ కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేక అపవాదులను మూటగట్టుకుంది. పేదలపట్ల ఒకరకంగా, ధనికుల పట్ల మరో రకంగా వ్యవహరించిందనే విమర్శల పాలైంది. రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన యాభై మందికి ‘రైటాఫ్’ పేరుతో దాదాపుగా మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం చిన్నమధ్యతరహా పరిశ్రమల విషయంలో ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే లాక్‌డౌన్ అమలులోకి రావడంతో వలస కార్మికులకు ఎక్కడలేని కష్టాలు వచ్చిపడ్డాయి. కాలినడకన వెళ్ళడానికి వలస కార్మికులను అనుమతించని ప్రభుత్వాలు విదేశాల్లో చిక్కుకుపోయినవారిని విమానాల్లో తీసుకురావడంపై విస్తృతంగా విమర్శలు వచ్చాయి. దీన్నుంచి బైటపడడానికి రైళ్ళ ద్వారా వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళడానికి వెసులుబాటు కల్పించిన కేంద్రం ఛార్జీల విషయంలో మరింత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది వలస కార్మికులు భవన నిర్మాణం, పరిశ్రమలు, ప్రాజెక్టులు.. లాంటివాటిలో పనిచేస్తున్నందున ఇప్పుడు సొంతూళ్ళలో ఉండిపోవడంతో ఆ రంగాలపై తక్షణం పడే ప్రభావం, దీన్ని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టింది.

ప్రజల ప్రాణాలను కాపాడడానికే లాక్‌డౌన్ అవసరమైందని ఎంతగా సర్దిచెప్పుకుంటున్నా చివరికి కోట్లాది మందికి ఉపాధి కోల్పోవడానికి దారితీయడం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారింది. వారి ప్రాణాలు, జీవితం కాపాడడంసరేగానీ వారికి భవిష్యత్ ఉపాధి సంగతేంటనే సందేహాలకు ఏ ప్రభుత్వమూ సమాధానం చెప్పలేకపోతోంది. లాక్‌డౌన్ కాలానికి ప్రైవేటు సంస్థలు వారి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చినా అది అమలుకాలేదనేది నగ్నసత్యం. ఇప్పుడు ఉపాధి కోల్పోయినవారి భవిష్యత్‌కు భరోసా లేకుండాపోయింది. చివరికి ఇది వ్యక్తిగత జీవనభద్రతకు మాత్రమే కాక మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు తీసుకురానుంది.

ప్రధాన నగరాలే అసలు సమస్య

లాక్‌డౌన్ అమలవుతున్నా కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలోనే ఉంటోంది. ఇలా వచ్చే కేసులన్నీ ఢిల్లీ, చెన్నయ్, ముంబయి, పూణె, అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్ లాంటి ప్రధాన నగరాల్లోనే ఉంటున్నందున అక్కడ నార్మల్ స్థితి నెలకొనడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది. దాదాపుగా ఇవన్నీ హాట్‌స్పాట్, రెడ్‌జోన్‌లుగా ఉండడంతో ఆంక్షలు మరికొంత కాలం కొనసాగక తప్పదు. ఎక్కువ ఉత్పాదకత యాక్టివిటీ, కార్మికుల ఉపాధి తదితరాలన్నీ ఈ నగరాల్లో ఉండడంతో ఉత్పత్తి, ఉపాధి అనే రెండు అంశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మింగుడుపడని సమస్యగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొత్త పాజిటివ్ కేసులు రాకుండా కట్టడి చేయడానికి ఇప్పటికే పంపిన ప్రత్యేక కేంద్ర బృందాలతో పాటు మరికొన్ని బృందాలను కూడా పంపాలని నిర్ణయం తీసుకుంది. ఎంత తొందరగా ఈ నగరాలు వైరస్ నుంచి బైటపడితే ఆర్థిక వ్యవస్థకు, లక్షల సంఖ్యలోని కార్మికులు, ఉద్యోగులకు అంత మేర ఉపాధి భరోసా లభిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నగరాలు వెంటనే కోలుకునేలా ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, దేశ ఆర్థిక వ్యవస్థ, కరోనా వైరస్ కట్టడి.. ఇలాంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వ సమర్ధతకు నిర్ణయాత్మక అంశాలుగా మారాయి.

Tags:    

Similar News