ఆ మహాత్ముని స్ఫూర్తితోనే మా పాలన : ప్రధాని నరేంద్రమోడీ

          మహాత్ముడు చూపిన బాటలోనే తమ పాలన కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు సాక్షిగా స్పష్టంచేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం అనేక ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. ఆర్టికల్ 370, అయోధ్య వివాద పరిష్కారం, త్రిపుల్ తలాక్, సీడీఎస్, కర్తార్‌పూర్ సాహెబ్ కారిడార్ వంటి వాటికి శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. మీలా ఆలోచిస్తే భారత్‌ […]

Update: 2020-02-06 04:22 GMT

హాత్ముడు చూపిన బాటలోనే తమ పాలన కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు సాక్షిగా స్పష్టంచేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం అనేక ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. ఆర్టికల్ 370, అయోధ్య వివాద పరిష్కారం, త్రిపుల్ తలాక్, సీడీఎస్, కర్తార్‌పూర్ సాహెబ్ కారిడార్ వంటి వాటికి శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. మీలా ఆలోచిస్తే భారత్‌ ఎప్పుడూ సమస్యల వలయంలో నలుగుతూనే ఉండేదని కాంగ్రెస్‌నుద్దేశించి మాట్లాడారు. విప్లవాత్మక మార్పులు తీసుకునేముందు చిన్నచిన్న గొడవలు తలెత్తడం సాధారణమే. అయినా ప్రతిపక్షం, విపక్షాలు కావాలనే దేశ ప్రజలను రెచ్చగొడుతున్నాయని దుయ్యబట్టారు. ఇన్ని రోజులు ట్రిపుల్‌ తలాక్‌ పేరుతో ముస్లిం మహిళలను భయపెట్టారనీ, కాంగ్రెస్ లాగా ఓటు రాజకీయాలు చేస్తే ట్రిపుల్‌ తలాక్‌ సమస్య ఇప్పటికీ అలాగే ఉండేదన్నారు. 70ఏండ్లుగా జమ్మూ కశ్మీర్‌ ప్రజలు పడుతున్న కష్టాలను 370అధికరణ రద్దుతో దూరం చేశామన్నారు. దేశంలోని సవాళ్లు, సమస్యలను ఎదుర్కొనే సత్తా తమలో ఉందని, తక్కువ సమయంలో పారదర్శకతతో కూడిన పాలనను ప్రజలకు అందజేస్తున్నామని మోడీ తెలిపారు. బీజేపీ హాయాంలో వ్యవసాయ బడ్జెట్‌ను 5 రెట్లు పెంచగా, 2కోట్ల మందికి గృహాలు కూడా నిర్మించి ఇచ్చామన్నారు. 13కోట్ల మంది ఇళ్లలో గ్యాస్ కనెక్షన్లు కల్పించగా,11 కోట్ల మరుగుదోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దేశవ్యాప్తంగా 37కోట్ల బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించామని వివరించారు. కొన్ని రాష్ట్రాలు కావాలనే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని అమలు చేయడంలేదని, పథకాల అమలులో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపైన ప్రతి,విపక్షాలు కావాలనే దేశ ప్రజలను రెచ్చగొడుతున్నాయని సీఏఏ వలన దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇది సరైన సమయం కాదని ఆందోళనలు దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతాయన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని అదంతా మనదేశంలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల వల్లే సాధ్యమైందని ప్రధాని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వారు ఆర్థికంగా ఎదిగేందుకు తమ వంతు సాయం చేస్తామన్నారు.

Tags:    

Similar News