కేసీఆర్‌ను అన్నా.. అని పిలిచే ఈటలకు ఏమైంది?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉద్యమ ప్రస్థానం నుంచి అధినేత వెన్నంటి ఉన్న ఆయనకు క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గిపోతోందా?. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అన్నింటా తానై వ్యవహరించిన ఆ మంత్రిని ఎందుకు దూరం పెడుతున్నారు?. సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? లేక అధిష్టానమే దూరం పెట్టేస్తోందా? అన్నదే టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయంతో పాటు కేబినెట్ నిర్ణయాల విషయంలో కూడా కీలక భూమిక పోషించిన ఈటల ఇప్పుడు అధినేతతో అంటీముట్టనట్టుగా […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉద్యమ ప్రస్థానం నుంచి అధినేత వెన్నంటి ఉన్న ఆయనకు క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గిపోతోందా?. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అన్నింటా తానై వ్యవహరించిన ఆ మంత్రిని ఎందుకు దూరం పెడుతున్నారు?. సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? లేక అధిష్టానమే దూరం పెట్టేస్తోందా? అన్నదే టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయంతో పాటు కేబినెట్ నిర్ణయాల విషయంలో కూడా కీలక భూమిక పోషించిన ఈటల ఇప్పుడు అధినేతతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం కూడా అదే తీరును కనబరుస్తుండడం విశేషం. కొన్ని బహిరంగ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్ సూచన మేరకు తానీ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించిన సందర్భాలూ ఉన్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈటల, కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎందుకు దూరం అవుతున్నారన్నదే ప్రస్తుతం అంచుచిక్కని ప్రశ్న.
టీఆర్ఎస్ పార్టీలో జరిగే కీలక పరిణామాలప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన ఈటల రాజేందర్‌కు నేడు ప్రగతి భవన్ వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ను అన్నా అని పిలిచే కొంతమంది వ్యక్తుల్లో ఈటల కూడా ఒకరు. అటువంటి వ్యక్తి ఊసు కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి రావడం లేదంటే అంతర్గతంగా ఏం జరిగిందన్నదే పజిల్‌గా మారింది. అధినేత కేసీఆర్ కూడా ఈటలపై అప్యాయతను ప్రదర్శించే వారు కానీ ఇప్పుడు ఆయన కూడా పట్టించుకోకపోవడం వెనక జరుగుతోంది ఏమిటన్నదే అర్థం కాకుండా పోయింది. హుజురాబాద్ కేంద్రంగా మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చించుకోవల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల లోపాలను బాహాటంగా ఎత్తి చూపారు. అప్పటికే ప్రగతి భవన్‌తో ఈటల సంబంధాలు గతితప్పడం వల్లే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇటీవల జరిగిన ఓ సమావేశానికి ఈటలకు ఆహ్వానం అందకపోవడం విశేషం.
గంగుల కీరోల్..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇప్పుడు కీలక భూమిక పోషిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. అధినేత టూర్లో అయినా, ఆయన తనయ పర్యటనలో అయినా గంగుల ప్రత్యక్ష్యం అవుతున్నారు. అత్యంత కీలకమైన గ్రాడ్యూయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గంగులకు బాధ్యతలు అప్పగించారు. ఆయనను హైదరాబాద్ సిటీ ఇంఛార్జిగా పార్టీ అధిష్టానం అప్పగించడంతో కల్వకుంట్ల ఫ్యామిలీకి గంగుల ఎంత దగ్గరయ్యాడో స్పష్టం అవుతోంది. ప్రతి విషయంలోనూ గంగుల కమలాకర్కే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా స్పష్టం అవుతుండడం ఇప్పుడు ఈటల వర్గీయులకు మింగుడుపడకుండా చేస్తోంది. కేసీఆర్ కుటుంబానికి గంగుల కమలాకర్ దగ్గర కాలేడని ఊహించిన వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ నేడు కమలాకర్ క్లోజ్‌గా మూవ్ అవుతుండడం విశేషం.
ఆయన ఉన్నా..
కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన బోయినలపల్లి వినోద్ కుమార్ ఈటల పక్షాన నిలబడుతున్నా గంగులకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారా? అన్న చర్చ కూడా సాగుతోంది. అత్యంత కీలక నిర్ణయాల్లో బోయిన్‌పల్లి భాగస్వామ్యం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈటలను మంత్రి వర్గంలో తీసుకునే విషయంలో కూడా వినోద్ కుమార్ జోక్యం తప్నని సరి అయింది. అయినా ఈటల విషయంలో మాత్రం బోయిన్‌పల్లి కూడా ఎలాంటి సపోర్ట్ చేయలేకపోతున్నారా అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. అన్నింటా ముందు వరసలో నిలిచే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వర్గపోరులోనూ ముందు వరసలో నిలుస్తున్నాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.