నో రూల్స్.. ఓన్లీ సేల్స్ !

ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మెడిసిన్ అమ్మకాలు దిశ, మెదక్ : ‘మీకు కడుపునొప్పి వస్తోందా..తల తిరిగి పోతుందా..నిద్రపట్టడం లేదా..మత్తుగా ఉండే మందు కావాలా..ఆ మందులు తెచ్చుకునేదెలా అని ఆందోళన చెందుతున్నారా..? అందుకు మీరేం హైరానా పడాల్సిన పనిలేదు. మీకు ఏ మందులు కావాలంటే ఆ మందులు ఇట్టే మెడికల్‌ దుకాణంలో దొరుకుతాయి. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకపోయినా సరే మీకు అవసరమైన మందులను ఇచ్చేస్తున్నారు. పైగా మీకున్న సమస్యను మెడికల్‌ దుకాణం సిబ్బందికి చెబితే చాలు ఏ మందులు వేసుకోవాలో, […]

Update: 2020-03-03 02:52 GMT

ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మెడిసిన్ అమ్మకాలు

దిశ, మెదక్ :
‘మీకు కడుపునొప్పి వస్తోందా..తల తిరిగి పోతుందా..నిద్రపట్టడం లేదా..మత్తుగా ఉండే మందు కావాలా..ఆ మందులు తెచ్చుకునేదెలా అని ఆందోళన చెందుతున్నారా..? అందుకు మీరేం హైరానా పడాల్సిన పనిలేదు. మీకు ఏ మందులు కావాలంటే ఆ మందులు ఇట్టే మెడికల్‌ దుకాణంలో దొరుకుతాయి. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకపోయినా సరే మీకు అవసరమైన మందులను ఇచ్చేస్తున్నారు. పైగా మీకున్న సమస్యను మెడికల్‌ దుకాణం సిబ్బందికి చెబితే చాలు ఏ మందులు వేసుకోవాలో, రోజుకు ఎన్ని వేసుకోవాలో కూడా వారే చెప్పేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 17 వందల మెడికల్ షాపుల్లో ఎక్కడా మెడికల్ రూల్స్ పాటించడం లేదు. ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించడం.. కేసులు నమోదు చేయడం.. ఆపై చేతులు దులుపుకోవడం కామనే..! ఈ నేపథ్యంలో మెడికల్‌ షాపు వైద్యం..ఎంత వరకు సేఫ్ అనేది ఓసారి గమనిద్దాం !

ఎన్నిసిరప్‌లు కావాలన్నా..

మెడికల్‌ షాపుల్లో లభించే కొరెక్స్‌, పెన్సిడ్రిల్‌ వంటి సిరప్‌లలో కొంత మత్తు ప్రభావం ఉండటం గమనార్హం. మాదక ద్రవ్యాలు దొరకని సమయంలో వాటికి బానిసైనవారు ఈ సిరప్‌లను వినియోగిస్తుంటారు. ఈ తరహా సిరప్‌లను డాక్టర్‌ రాసి ఇస్తేనే సదరు రోగికి ఇవ్వాలి. అయితే, మెడికల్‌ షాపుల నిర్వాహకులు ఇవేవీ పట్టించుకోకుండా యథేచ్చగా మందులు ఇచ్చేస్తున్నారు. ఇవేగాక నిషేధిత డ్రగ్స్‌, కాలపరిమితి దాటిన మందులు, నకిలీ మందుల విక్రయాలు కూడా మెడికల్ షాపుల్లో జోరుగా సాగుతున్నాయి. రోగి అడిగిన మందు లేకపోతే.. దానికి బదులుగా మరో కంపెనీకి చెందిన మందులను రోగులకు అంటగట్టడమూ నిర్వాహకులకు పరిపాటిగా మారింది.

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకున్నా..

రోగి కానీ, అతని తాలుకు వ్యక్తిగాని వచ్చి ఫలానా మందులు కావాలంటే మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్‌ లేకున్నా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా కార్డియాలజీ, సైకియాట్రి, న్యూరాలజీ, బ్రెయిన్‌ స్ట్రోక్‌, అబార్షన్‌, డయోబెటిక్‌, బీపీ, స్లీపింగ్‌, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ తదితర మందులను డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఇవ్వకూడదు. ఇందులో హైడోస్‌, లో డోస్‌ ఉంటాయి. రోగ తీవ్రత, వయసును బట్టి డాక్టర్లు డోసులను నిర్ణయిస్తారు. ప్రిస్క్రిప్షన్‌పై డాక్టర్‌ ఎన్ని మందులు రాశారో ఆ మేరకే ఇవ్వాలి. ఆ తర్వాత రోగి మరోసారి వచ్చి వాటిని కావాలని అడిగినా ఇవ్వకూడదు. అయితే ఈ నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించడం లేదు.

ఫార్మసిస్టులు ఎక్కడ ?

‘డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ – 1940’ ప్రకారం ప్రతి మెడికల్‌ షాపులో రిజిస్టర్డ్ ఫార్మసిస్టు ఉండాలి. బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ పూర్తి చేసిన వారు, రిజిస్టర్‌ చేసుకున్న వారు మాత్రమే మెడికల్‌ దుకాణాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఔషధ నియంత్రణ అధికారులు ఫార్మసిస్టు ఉంది, లేనిదీ పరిశీలించిన తర్వాతే మెడికల్ దుకాణాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత ఏరియా ఇన్‌స్పెక్టర్లు కూడా తనిఖీలు చేసిన సమయంలో ఫార్మసిస్టు ఉన్నారా..? లేదా..? అని పరిశీలించాల్సి ఉంటుంది. లేకపోతే షోకాజ్‌ నోటీసు జారీచేసే అవకాశముంది. అయితే, అధికారుల లెక్కల ప్రకారం, ఇన్‌స్పెక్టర్ల నివేదికల ప్రకారం ప్రతీ మెడికల్‌ షాపు ఫార్మసిస్టు పర్యవేక్షణలో నడుస్తున్నట్లుగానే ఉంటుంది.

ఇవీ నిబంధనలు..

– డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా షెడ్యూల్‌ మందులను విక్రయించరాదు.

– నాన్‌ షెడ్యూల్‌ మందులను కూడా రెండోసారి ఇవ్వకూడదు.

– ప్రిస్క్రిప్షన్‌లో సూచించిన మేరకే మందులు ఇవ్వాలి.

– డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌లో రాసిన మందులు కాకుండా ప్రత్యామ్నాయ మందులు ఇవ్వకూడదు.

– మందులు ఇచ్చిన ప్రతిసారి మెడికల్‌ షాపు స్టాంప్‌ వేయాలి.

– విక్రయించిన మందులను సూచిస్తూ తప్పనిసరిగా బిల్ ఇవ్వాలి.

– ఎప్పటికప్పుడు మందుల అమ్మకాల వివరాలను రిజిస్టర్‌లో పొందుపరచాలి.

– దుకాణంలో మందులను వరసగా పేర్చాలి.

– గడువు దాటిన మందులకు విక్రయించకూడదు.

– ఫ్రిజ్‌లో మందుల నిల్వ సక్రమంగా ఉంచాలి.

– మెడికల్‌ దుకాణాల్లో మందులను కలిపే ప్రయత్నాలు చేయకూడదు.

– రోగికి వైద్య పరీక్షలు చేసి మందులను ఇచ్చే విధానం అవలంబించకూడదు.

– మెడికల్‌ షాపుల్లో రోగులకు ఇంజెక్షన్‌ చేయకూడదు.

Tags:    

Similar News