భావవ్యక్తీకరణకు ముసుగు?
దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రియా..మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడ్డాను’, ‘నిన్ను ఫస్ట్‌టైమ్ చూసినపుడే అనుకున్నా నువ్వు బాగా పనిచేస్తావని!’, ‘నీ ముఖంలోని ఆ చెరగని చిరునవ్వులో ఏదో మ్యాజిక్ ఉందయ్యా!’.. ఇక నుంచి ఇలాంటి వాక్యాలు వినిపించవు. అది ఎందుకు అని తెలుసుకోవడానికి ముందు ఈ వాక్యాల్లో ఇమిడి ఉన్న ఒక మానసిక తర్కాన్ని బేరీజు వేయాలి. మొదటి చూపులో ప్రేమలో పడటం, ఫస్ట్‌టైమ్ చూసినపుడు అంచనా వేయడం..ఇవన్నీ ఎలా సాధ్యం? సాధ్యమే… మన భావాలను వ్యక్తపరచడానికి […]
దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రియా..మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడ్డాను’, ‘నిన్ను ఫస్ట్‌టైమ్ చూసినపుడే అనుకున్నా నువ్వు బాగా పనిచేస్తావని!’, ‘నీ ముఖంలోని ఆ చెరగని చిరునవ్వులో ఏదో మ్యాజిక్ ఉందయ్యా!’.. ఇక నుంచి ఇలాంటి వాక్యాలు వినిపించవు. అది ఎందుకు అని తెలుసుకోవడానికి ముందు ఈ వాక్యాల్లో ఇమిడి ఉన్న ఒక మానసిక తర్కాన్ని బేరీజు వేయాలి. మొదటి చూపులో ప్రేమలో పడటం, ఫస్ట్‌టైమ్ చూసినపుడు అంచనా వేయడం..ఇవన్నీ ఎలా సాధ్యం? సాధ్యమే… మన భావాలను వ్యక్తపరచడానికి నాలుక మాత్రమే అవసరం లేదు. కండ్లు, ముక్కు, చెవులు, నోటితో కూడా భావవ్యక్తీకరణ చేయొచ్చు. ఆ విధంగా ఎవరైనా మొదటిసారి కలిసి వారి మాటలను కాకుండా కండ్లను, నోటిని, పెదాల కలయికను, ముక్కును గమనించిన వారే పైన చెప్పిన వాక్యాలను చెప్పగలుగుతారు. అంటే వారు ఎదుటివ్యక్తిని వారి హావభావాల ద్వారా చదువుతున్నారన్నమాట. ఇక నుంచి ఇలాంటి వాక్యాలు వినిపించవని అనడానికి గల కారణం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.
అవును..ముఖానికి వేసుకున్న మాస్క్ కారణంగా పరోక్షంగా మనసులోని భావాలకు ముసుగు తొడిగిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో సామాజిక భావవ్యక్తీకరణ కుంటుపడుతోంది. కొవిడ్ కారణంగా స్నేహితులను, బంధువులను వ్యక్తిగతంగా కలబడానికి కూడా సంకోచిస్తున్నాం. ఇక కొత్త వ్యక్తులను కలవడం వారితో పరిచయం పెంచుకోవడమే కొద్దిగా కష్టమే. అందుకు ప్రయత్నించినా కూడా మాస్క్ ఒక అడ్డంకిగా తయారైంది. మాస్క్ కారణంగా తెలిసిన వ్యక్తులను కూడా దగ్గరికి వచ్చే వరకు వేచి చూసి గుర్తుపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదా వాళ్లే ముందు గుర్తుపట్టి నమస్కారం పెట్టినా, వారెవరో మనం గుర్తుపట్టడానికి సమయం పట్టి అయిష్టంగానే చేతులు ఊపాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎదుటి వ్యక్తి ముఖంలో హావభావాలు చూసి, వారు మంచివారా? చెడ్డవారా? అని గ్రహించి వారితో స్నేహం చేసే వ్యక్తులకు ఇప్పుడు చాలా పెద్ద కష్టం వచ్చింది. ఒకప్పుడు మనసులో ఒకటి పెట్టుకుని, పైకి ఒకటి మాట్లాడేవాళ్ల నిజస్వరూపాన్ని వారి ముఖంలో కవళికలు తెలియజెప్పేవి. ఇప్పుడు కండ్లు పైకి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నా, మాస్క్ కింద దాగి ఉన్న మూతి ఎన్ని వంకర్లు తిరుగుతుందో తెలియడం లేదు. ఎంతైనా మన దగ్గరి వాళ్లు మనతో మాస్క్ లేకుండా మాట్లాడితే కలిగే ఫీలింగ్‌కు, మాస్క్ వేసుకుని మాట్లాడితే కలిగే ఫీలింగ్‌కు చాలా తేడా కనిపిస్తుంది. మనం చెప్పే మాటల మీద ఎదుటి వ్యక్తి ఆసక్తిగా ఉన్నాడా లేదా అనే సంగతి కూడా ఇప్పుడు తెలియడం లేదు. అంతేగాకుండా వేరొకరు చెప్పే మాటలు మనకు బోర్ కొట్టినా కూడా ఆ ఫీలింగ్ మాస్క్ కారణంగా బయటపెట్టలేకపోతున్నాం.
ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు చెవికి సరిగా అర్థంకాకపోయినప్పటికీ, అతని పెదవుల కదలికలను, ముఖ కవళికలను బట్టి అర్థం చేసుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాటలు అర్థంకాకపోతే, మళ్లీ రెండోసారి అడగాల్సి వస్తుంది. ఇలా రెండోసారి అడిగితే తప్పుగా అర్థం చేసుకునే వాళ్లు ఎందరో ఉంటారు. ఉదాహరణకు ప్రభుత్వశాఖల్లో పనిచేసే పైఅధికారులను రెండోసారి అడిగితే వారి ఈగో హర్ట్ అవుతుంది. దీంతో కింది స్థాయి ఉద్యోగులు వాళ్లకు అర్థమైనదే అమలు చేయడంతో అంతిమంగా ప్రజలు నష్టపోవాల్సి వస్తుంది. ఇక దూరం నుంచి ఇద్దరి మాటలను గమనించి, వారి హావభావాలు, చేతి కదలికల ద్వారా వారు ఏం మాట్లాడుకుంటున్నారో అంచనా వేసే వారికి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఏదేమైనా మాస్క్ కారణంగా మనసులోని భావాలకు పెద్ద ముసుగు తొడిగినట్లైంది. ఈ ముసుగును తొలగించే రోజు వస్తుందో రాదో కానీ, ఈ ముసుగు వంక పెట్టుకుని మనుషులు కొత్త ముసుగులు తొడుక్కోకుండా ఉండే బంధాలు ఎన్నటికైనా బలంగానే ఉంటాయి.