మాలిలో సైనిక తిరుగుబాటు.. ప్రెసిడెంట్, ప్రధాని అరెస్టు
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో రాజకీయ సంక్షోభం, ఆర్థిక అనిశ్చిత కొనసాగుతున్న తరుణంలో హఠాత్తుగా మంగళవారం సైనికతిరుగుబాటు జరిగింది. దేశాధ్యక్షుడు ఇబ్రహీం బాబకర్ కేటా, ప్రధాని బాబౌ సిస్‌లను సైన్యం మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. కేటా నివాసం నుంచి తుపాకులను గురిపెట్టి వీరిరువురిని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేసి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మంగళవారం రాత్రి ప్రభుత్వ మీడియాలో ఆయన కనిపిస్తూ ‘ఈ రోజు […]
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో రాజకీయ సంక్షోభం, ఆర్థిక అనిశ్చిత కొనసాగుతున్న తరుణంలో హఠాత్తుగా మంగళవారం సైనికతిరుగుబాటు జరిగింది. దేశాధ్యక్షుడు ఇబ్రహీం బాబకర్ కేటా, ప్రధాని బాబౌ సిస్‌లను సైన్యం మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. కేటా నివాసం నుంచి తుపాకులను గురిపెట్టి వీరిరువురిని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేసి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
మంగళవారం రాత్రి ప్రభుత్వ మీడియాలో ఆయన కనిపిస్తూ ‘ఈ రోజు దేశరాజకీయంలో మిలిటరీ జోక్యం తప్పనిసరి అని భావించింది. నాకు వేరే అవకాశం లేదు. రక్తపాతాన్ని నేను కోరుకోవడం లేదు.’ అని పేర్కొంటూ రాజీనామా చేశారు. అయితే, సైన్యమే ఇప్పుడు దేశబాధ్యతను తీసుకున్నదా? అనేది ఇంకా అస్పష్టంగానే ఉన్నది. ఈ తిరుగుబాటును యూఎన్, యూరప్ దేశాలు సహా పలువురు నేతలు ఖండించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ విధ్వంసం కావడానికి, దేశ భద్రతను బలహీనం చేయడానికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు రాజీనామా చేయాలని నెలలపాటు ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మంగళవారం దేశరాజధాని బమాకోకు సమీపంలోని కాతి టౌన్‌లోని కీలక బేస్‌లో సైనికులు ఆయుధాలు పట్టుకుని తిరుగుబాటను ప్రకటించారు. వెంటనే ప్రతిపక్ష ఆందోళనకారులు బమాకోలో గుమిగూడి సైనికులకు సంఘీభావాన్ని ప్రకటించారు.
దేశాధ్యక్షుడి రాజీనామా తర్వాత తిరుగుబాటు వెనుకున్న సైనికులు టీవీలో దర్శనమిచ్చారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఏర్పడ్డ కమిటీగా పేర్కొన్న ఆ సైనిక బృందం తాము దేశంలో అధికారం కోసం తపించడం లేదని, దేశ స్థిరత్వానికి, పటిష్టత్వానికి ఈ చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. ప్రజల సహకారంతో మాలికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని మాలి ఎయిర్‌ఫోర్స్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇస్మాయిల్ వాఘ్ తెలిపారు. సరిహద్దులు మూసివేయబడ్డాయని, రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమలవుతుందని ప్రకటించారు. దేశంలోని సంస్థల పటుత్వానికి మాలిలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నదని, దీనికి తగిన ప్రణాళికను రూపొందిస్తామని తెలిపింది. తద్వారా దేశ ప్రజల దైనందిన జీవితం మెరుగుపడుతుందని పేర్కొంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య విశ్వాసం స్థిరపడుతుందని వివరించింది.