స్నేహితుల మధ్య లూడో గేమ్ చిచ్చు.. కత్తిపోట్లతో ఒకరు మృతి
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : లూడో గేమ్ ఆడుతున్న స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీయగా మరో ఇద్దరు కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ రణవీర్ రెడ్డి కథనం ప్రకారం స్థానిక ఇందిరానగర్ జెండా గల్లీలో రాత్రి 2 గంటల సమయంలో గంగాబౌలి ప్రాంతానికి చెందిన మోహమ్మద్ హనీఫ్(25), టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : లూడో గేమ్ ఆడుతున్న స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీయగా మరో ఇద్దరు కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ రణవీర్ రెడ్డి కథనం ప్రకారం స్థానిక ఇందిరానగర్ జెండా గల్లీలో రాత్రి 2 గంటల సమయంలో గంగాబౌలి ప్రాంతానికి చెందిన మోహమ్మద్ హనీఫ్(25), టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన రషీద్(30), మంగళ్ హాట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముస్తఫా(24)తో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురు యువకులు లూడో గేమ్ ఆడుతున్నారు. ఆటలో భాగంగా గెలుపు, ఓటములపై వారి మధ్య వివాదం నెలకొంది. మద్యం మత్తులో ఉన్న వారు ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు.
అంతటితో ఆగకుండా రెచ్చిపోయి పరస్పరం పిడుగుద్దులతో దాడులు చేసుకున్నారు. కొద్ది సమయం అనంతరం వారు మహ్మద్ హనీఫ్ పై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన హనీఫ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ముస్తఫా, రషీద్‌లకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇన్ స్పెక్టర్ రణవీర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, 307 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.